Hero Dharmendra:బాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ ధర్మేంద్ర (Dharmendra ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటుడిగా భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. నిన్నటి నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ.. హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆయనకు ఇద్దరు భార్యలు.. ప్రకాష్ కౌర్ (Prakash Kaur), హేమమాలిని(Hemamalini ). ఈ క్రమంలోనే మొదటి భార్య ఉండగానే ఆమెకు విడాకులు ఇవ్వకుండా ప్రముఖ హీరోయిన్ హేమమాలినిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలు కూడా జన్మనిచ్చారు. అయితే భార్య ఉండగానే రెండో పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారం ఎలా జరిగింది? అసలు ఆయన జీవితంలో చోటు చేసుకున్న ట్విస్టులు ఏంటి? ఇలా పలు విషయాలు వైరల్ అవుతున్నాయి.
ALSO READ:MM Keeravani: కీరవాణి సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన శృతిహాసన్.. అందుకే ఆస్కార్ గ్రహీత అంటూ!
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలిన ధర్మేంద్ర వ్యక్తిగత జీవితం సినిమాలకు ఏమాత్రం తీసిపోని రేంజిలో ఉంటుందనడంలో సందేహం లేదు. ధర్మేంద్రకి ప్రకాష్ కౌర్ తో ఆల్రెడీ వివాహం జరిగింది. సన్నీడియోల్, బాబీ డియోల్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ హేమమాలినీని ఇష్టపడి మరీ వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహం చేసుకోవడం వెనుక ఆయన ఏం చేశారు? అసలు వీరి ప్రేమ ఎలా మొదలైంది? పెళ్లి కోసం వీరు పడ్డ కష్టం ఏంటి? మొత్తంగా అసలు ఏం జరిగింది ? అనే విషయాలు తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం అనే చెప్పాలి. బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర.. డ్రీమ్ గర్ల్ హేమాలినిల అందమైన సంబంధం గురించి అందరికీ తెలుసు. కానీ ఎక్కడ వీరి ప్రేమ మొదలైంది అనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. వీళ్లిద్దరూ కలిసి ‘తుమ్ హసీన్ మై జవాన్’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అలా రీల్ జంటగా నటిస్తూ.. రియల్ జంటగా మారిపోయారు.
ఇకపోతే వీరి ప్రేమ కథకు అంత సులభంగా ఎండ్ కార్డు పడలేదు. ధర్మేంద్ర మొదట ప్రకాష్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. దీంతో ఒకరు.. ఇద్దరు భార్యలను కలిగి ఉండడం హిందూ వివాహ చట్టం ప్రకారం కుదరదు. మరోవైపు తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ధర్మేంద్ర ఇష్టపడలేదు. అలా అని హేమమాలినిని వదిలి దూరంగా ఉండలేకపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఏకంగా ముస్లిం మతంలోకి మారాడు. అక్కడ నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడానికి కూడా అనుమతి ఉందని, ఆ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని 1979లో ఇస్లాంలోకి మారాడు. అలా తన పేరును దిలావర్ ఖాన్ కేవల్ కృష్ణ గా మార్చుకోగా.. హేమమాలిని తన పేరును ఐషా బీ ఆర్ చక్రవర్తిగా మార్చుకుంది. 1980లో మతం మారిన తర్వాత వివాహం చేసుకున్న ఈ జంటకు మూడేళ్ల తర్వాత ఇషా డియోల్, అహానా డియోల్ జన్మించారు.