Delhi Blast Case: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు కేసులో కీలక పురోగతి. ఈ దాడికి సూత్రధారి డాక్టర్ ఉమర్ మహమ్మద్‌గా అధికారులు భావిస్తున్నారు. అతడి ఫోటోను విడుదల చేశారు. ఇంతకీ డాక్టర్ ఉమర్ ఎందుకు దాడికి పాల్పడ్డాడు? వెనుక అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. ఆత్మాహుతి దాడి?
ఎర్రకోట సమీపంలోని దాడిని ఆత్మాహుతి దాడిగా దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఘటనకు ఉపయోగించిన కారు.. పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్‌కి చెందినదిగా గుర్తించారు. కారుని డ్రైవింగ్ చేసుకుంటూ పార్కింగ్‌కి తీసుకెళ్లింది ఆయనేనని అంచనాకు వచ్చారు. ఆయనకు సంబంధించిన ఫోటోలు ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.
ఘటనకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న డాక్టర్ ఉమర్, జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతానికి చెందినవాడు. శ్రీనగర్‌లోని ఎండీ మెడిసిన్ కాలేజీలో చదివాడు. ఆ తర్వాత అనంతనాగ్ లో జీహెచ్‌సీ పని చేశాడట. ప్రస్తుతం అల్ఫాలా ఫరీదాబాద్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గత నెలలో అమీర్ పేరు మీద వాహనం కొనుగోలు చేశాడు. ఆ వాహనాన్ని పేలుడు కోసం ఉపయోగించినట్టు గుర్తించారు.
మాస్టర్ మైండ్ డాక్టర్ ఉమర్, ఆ భయంతోనే
ప్రస్తుతం బ్లాస్ట్ కేసులో వరుసగా అరెస్టుల పర్వం మొదలైంది. జమ్మూకాశ్మీర్‌కి చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. వారిలో అమీర్ రషీద్ మిర్, ఉమర్ రషీద్, తారిఖ్ మాలిక్ ఉన్నారు. మరో 13 మంది పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పేలుడుకు సంబంధించిన పలు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నాయి ఎఫ్ఎస్‌ఎల్ బృందాలు.
ఘటన జరిగిన ప్రాంతంలో నిందితుడి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. కారు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై సీసీటీవీ ఫుటేజ్‌ను దాదాపు 200 మంది పోలీసులు పరిశీలిస్తున్నారు. తొలుత కారు ఫరీదాబాద్ నుంచి బయలు దేరి బర్దార్‌పూర్, సరై కాలే ఖాన్, ఐటీఓ ప్రాంతాల మీదుగా రెడ్ ఫోర్టుకి చేరుకున్నట్లు ఓ అంచనాకు వచ్చారు అధికారులు.
ALSO READ: ఎర్రకోట పేలుడు ఘటన.. సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్నది ఒక్కడే
ఈ పేలుడుకు కొన్నిగంటల ముందు ఫరీదాబాద్‌లో ఓ వైద్యుడు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్‌తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలు ఉన్నాయి. పేలుడు పదార్థాల కేసులో ఫరీదాబాద్‌లో డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్ అరెస్టు చేశారు.
అరెస్టయిన వారికి డాక్టర్ ఉమర్ అత్యంత సన్నిహితుడిగా భావించారు. ఈ క్రమంలో కారు యజమాని డాక్టర్ ఉమర్ తీవ్ర భయాందోళనకు గురైనట్టు పోలీసుల ప్రాథమిక అంచనా. డాక్టర్ ఉమర్ డీఎన్ఏ సేకరించిన అధికారులు, అతడి తల్లి, సోదరులను జమ్మూ కాశ్మీర్‌లో విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన డీఎన్ఏ.. వారితో పరీక్షలు చేసే అవకాశముంది.
సన్నిహితుల అరెస్టు తర్వాత డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్ నుండి పారిపోయాడని దర్యాప్తు అధికారుల అంచనా. మొఘల్ పాలకులు నిర్మించిన స్మారక చిహ్నం ఎర్రకోట సమీపంలో పేలుడుకు ప్రేరేపించినట్టు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. దేశంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఇది కూడా ఒకటి.
ఢిల్లీ పేలుడు ఘటన ప్రధాన సూత్రధారి ఉమర్..?
ఉమర్ పాత్ర నిర్ధారణ కోసం డీఎన్ఏ పరీక్షలు
కశ్మీర్‌లోని అతని కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ నమూనాల సేకరణ
ఇప్పటికే పేలుడు ప్రదేశంలో శరీర భాగాలను గుర్తించిన అధికారులు
కారులో ఉన్నది ఖచ్చితంగా ఉమరేనని అనుమానాలు #DelhiBlast pic.twitter.com/Kpb2POmozo
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025