Tollywood Comedian:ఐరన్ లెగ్ శాస్త్రి.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఐరన్ లెగ్ శాస్త్రి – బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చే సీన్స్ ఏ రేంజ్ లో పండాయో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ కి అభిమానులు కూడా ఫిదా అయ్యేవారు.. అలాంటి ఐరన్ లెగ్ శాస్త్రి మరణించడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోయారు. అలా ఒక మంచి కమెడియన్ ని కోల్పోయింది ఇండస్ట్రీ..
ఇకపోతే హాస్యభరితమైన పురోహితుడి పాత్రతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈయన.. చివరి క్షణాల్లో మాత్రం అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆయన తనయుడు ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పుకొచ్చారు. అంతేకాదు దానివల్లే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రసాద్ మాట్లాడుతూ..”మా నాన్న వంద సీరియల్స్.. 500 కు పైగా చిత్రాలలో నటించారు.. అయినా సరే ఆయన సంపాదించింది ఏమీ లేదు. చాలామంది ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టారు. ఇంకొంతమంది కేవలం భోజనం పెట్టి మాత్రమే పంపించేవాళ్లు. పైగా బ్రాహ్మణుడు కావడంతో ఆయనకి ఆత్మాభిమానం ఎక్కువగా ఉండేది. అందుకే ఎవరిని కూడా ఏమి అడిగే వారు కాదు. అదే అదునుగా తీసుకొని.. కొంతమంది ఆయనను తప్పుదారి పట్టించారు.
మందు పార్టీలు, సిట్టింగ్స్లో ఉంటేనే ఛాన్సులు వస్తాయని చెప్పి తాగుడుకు అలవాటు చేశారు. ఆ తాగుడుకు అలవాటు పడిన తర్వాత ఉన్న అవకాశాలు కూడా పోయాయి. దాంతో మందుకు మరింత బానిసయ్యారు. చేసేదేమీ లేక మళ్ళీ పౌరోహిత్యం వైపు రావాలనుకున్నా.. అప్పటి పరిస్థితులు ఆయనను ఆ వైపు అడుగులు వేసేలా చేయలేదు. అలా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మా నాన్న సినిమాల ద్వారా సంపాదించిన ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. అందుకే ఆయన అంత్యక్రియలకు ఎన్నో ఇబ్బందులు పడ్డాము. అయితే ఆ కార్యక్రమాల కోసం అవసరమైన డబ్బును బంధువులే ఏర్పాటు చేశారు.
పైగా ఐరన్ లెగ్ శాస్త్రి తనయుడిగా నన్ను కూడా ఎవరు గౌరవించలేదు. అవకాశాలు కూడా ఇవ్వలేదు. పైగా అవమానించారు. అందువల్లే నేను చదువుపై దృష్టి పెట్టి ఎంబీఏ.. సీఏ పూర్తి చేసి ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాను” అంటూ ఐరన్ లెగ్ శాస్త్రి కొడుకు ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తన తండ్రి వల్ల తనకు ఒరిగిందేమీ లేదు అంటూ ప్రసాద్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Aishwarya Rajesh: లక్కీ ఛాన్స్ కొట్టేసిన భాగ్యం.. మసుధ డైరెక్టర్ తో ఓరియంటెడ్ మూవీ
ఐరన్ లెగ్ శాస్త్రి విషయానికి వస్తే.. ఈయన అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. పలు చిత్రాలలో పురోహితుని పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన అప్పుల అప్పారావు చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన ఈయన.. ఆ తర్వాత ప్రేమఖైదీ, ఏవండీ ఆవిడ వచ్చింది, ఆవిడ మా ఆవిడ, పేకాట పాపారావు మొదలైన సినిమాలు చేసి నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. జూన్ 19 2006 లో గుండెపోటుతో మరణించారు.