JR NTR: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’గా నిలిచిన నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) కార్యాలయం నుండి తాజాగా ఒక కీలకమైన ప్రకటన వెలువడింది. ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ కొందరు చేస్తున్న అనధికారిక, మోసపూరిత కార్యకలాపాలపై ఆయన టీం తీవ్రంగా స్పందించింది. ఇటీవలి కాలంలో కొన్ని అభిమాన సంఘాలు, నిర్దిష్ట వ్యక్తులు ఎన్టీఆర్ గారి పేరుతో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నటిస్తూ, పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్న ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని సదరు ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
కొందరు ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ ఇమేజ్‌ను వాడుకుని డబ్బులు వసూలు చేస్తున్నారని, అయితే ఈ తరహా కార్యక్రమాలకు, ఎన్టీఆర్ కి గానీ, ఆయన కార్యాలయానికి గానీ ఎలాంటి సంబంధం లేదని ఆర్ట్స్ అండ్ పిఆర్ టీం స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఇలాంటి విరాళాల సేకరణను ఎన్టీఆర్ ఏ రకంగానూ ఆమోదించడం లేదని, ఇవన్నీ ఆయనకు తెలియకుండా జరుగుతున్నవని అధికారికంగా వెల్లడించారు. అభిమానం పేరుతో జరిగే ఇలాంటి మోసపూరిత వసూళ్ల పట్ల ప్రజలు, అభిమానులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఎన్టీఆర్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది.
ఎన్టీఆర్ కార్యాలయం తమ ప్రకటనలో ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేసింది. ఎన్టీఆర్ తో లేదా వారి కార్యాలయంతో సంబంధం ఉన్నట్లుగా నమ్మిస్తూ సాగించే ఇటువంటి అనధికారిక కార్యక్రమాలకు ఎవరూ కూడా విరాళాలు ఇవ్వవద్దు. డబ్బులు ఇచ్చి మోసపోవద్దని కోరారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ గారి తరఫున ఎలాంటి అధికారిక ప్రకటనలు, సామాజిక సేవా కార్యక్రమాలు లేదా ఇతర ఏవైనా అధికారిక సంబంధాలు ఉన్నా… వాటిని నేరుగా ఎన్టీఆర్ గారి ద్వారా మాత్రమే వెల్లడిస్తారు. ఈ క్లిష్ట సమయంలో తమకు మద్దతుగా నిలుస్తున్నందుకు, నిరంతరం చూపిస్తున్న అపారమైన అభిమానానికి ఎన్టీఆర్ కార్యాలయం అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
Read also-ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు తప్పక చూడాల్సిన కొరియన్ సిరీస్ లు…
సినీ హీరోల పేరుతో అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేయడం కొత్తేమీ కాకపోయినప్పటికీ, కొన్ని శక్తులు దీనిని ఆసరాగా చేసుకుని స్వార్థ ప్రయోజనాల కోసం వసూళ్లకు దిగడం కలకలం రేపుతోంది. అందుకే, తారక్ అభిమానులు ఎవరూ ఇటువంటి తప్పుడు ప్రచారాలను, విరాళాల సేకరణలను నమ్మకూడదని, ఏదైనా సమాచారం ఉంటే అధికారిక వనరుల ద్వారానే సరిచూసుకోవాలని ఈ ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయడానికి అభిమానుల అప్రమత్తత ఎంతో అవసరం.