Kota Srinivasa Rao:అటు హాస్యం పండించడంలో.. ఇటు విలనిజం చూపించడంలో ఈయన తర్వాతే ఎవరైనా.. అంతలా తన అద్భుతమైన నటనతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సొంతం చేసుకున్నారు కోటా శ్రీనివాసరావు (Kota Srinivas Rao) . ఒకవైపు నటుడిగా.. మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కోటా శ్రీనివాసరావు. ఇక ఈయన నటుడు గానే కాకుండా సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు. అలా ఇండస్ట్రీకి వచ్చి నాలుగు దశాబ్దాల కెరియర్ లో 750కి పైగా చిత్రాలలో నటించిన కోటా శ్రీనివాసరావు.. ఈరోజు ఉదయం.. ఫిలింనగర్ లో ఉన్న తన నివాసంలో కన్నుమూశారు.
టైం వచ్చినప్పుడు.. మనకి టైం ఉండదు – కోటా శ్రీనివాసరావు
కోటా శ్రీనివాసరావు మరణంతో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి, కన్నీటి పర్యంతమవుతున్నారు. ముఖ్యంగా బాబు మోహన్, బ్రహ్మానందం కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు. కోటా శ్రీనివాసరావు మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇలాంటి సమయంలో టైం వచ్చినప్పుడు ఇక మనకి టైం ఉండదు అంటూ మరణం గురించి గతంలో ఆయన చెప్పిన మాటలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అసలు విషయంలోకి వెళ్తే కోటా శ్రీనివాసరావు గతంలో అనారోగ్యం పాలైనప్పుడు.. కొన్ని మీడియా సంస్థలు కోట చనిపోయారు అంటూ ఆయన బ్రతికుండగానే ఆయనను చంపేస్తూ వీడియోలు రిలీజ్ చేశాయి. ఆ సమయంలో ఆయన ఆ వార్తలను ఖండిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి.
బ్రతికుండగానే చంపేశారు – కోటా శ్రీనివాసరావు రావు
కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ..” ఆర్టిస్ట్ కి ఒక సమయం అంటూ వస్తుంది.. ఆ సమయం వచ్చింది అంటే.. నీకు ఇక టైం ఉండదు. ఆ టైంలోనే అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే అది ప్రవర్తన. మన ప్రవర్తనే మనకు పనిని కల్పిస్తుంది. ప్రవర్తన బాగుంటే నీకు పని దొరుకుతుంది. లేదంటే ఆస్తులు పోగొట్టుకొని నువ్వు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్లను చాలామందినే చూశాము. అయితే భగవంతుడి దయ వల్ల అలాంటివేమీ నాకు జరగలేదు. ఏదో వెళ్లిపోతాను. సమయం వచ్చినప్పుడు నాకు సమయం ఉండదు. వాడెవడో కోటా శ్రీనివాసరావు చచ్చిపోయాడని బ్రతికుండగానే చంపేశాడు. నాకు ఆరోగ్యం బాలేదంటే బాలేదని చెప్తాను. వయసు మీద పడినప్పుడు అన్నీ బాగోవు కదా.. అనారోగ్యంగా ఉంటే వాడెవడో ఏకంగా చంపేశాడు.ఇక నాపై అలాంటి వార్తలు రాసిన వ్యక్తిని పిలిచి గట్టిగా అరిచాను కూడా.. నిజంగా మనిషి బ్రతికి ఉండగానే చంపేయడం దారుణం.. ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉంటుందా అంటూ తన మరణ వార్తలను తానే ఖండించుకొని అందరి చేత కన్నీళ్లు పెట్టించారు. ఇక అలాంటి వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమని చెప్పాలి.
ALSO READ:Kota Srinivas Rao: నటుడు మాత్రమే కాదు సింగర్ కూడా.. కోట ఆలపించిన ఆ పాటలేంటంటే?