Black Pepper: నల్ల మిరియాలు(black pepper ) వంటకాల్లో ఒక ముఖ్యమైన సుగంధ ద్రవ్యం. ఇది ఆహారానికి రుచిని మాత్రమే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే.. ఎలాంటి పదార్థమైనా అధికంగా తీసుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. నల్ల మిరియాలు విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. వాటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలు:
నల్ల మిరియాలు జీర్ణక్రియకు సహాయపడతాయని భావిస్తారు. అయితే.. అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా, కడుపులో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ (Acid Reflux) ఉన్నవారు నల్ల మిరియాలను ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలు మరింత తీవ్ర మయ్యే అవకాశం ఉంది. మిరియాలలో ఉండే పైపెరిన్ (Piperine) అనే రసాయనం కడుపులో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా ఇది అసౌకర్యానికి దారితీస్తుంది. కొంత మందిలో కడుపు నొప్పి, వికారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
అలెర్జీ:
కొంతమందికి నల్ల మిరియాలకు అలెర్జీ ఉంటుంది. అలాంటి వారికి నల్ల మిరియాలు తీసుకున్నప్పుడు చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం లేదా కళ్ళు ఎర్రబడటం వంటి అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
అధిక రక్తస్రావం:
నల్ల మిరియాలు రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదింపజేసే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది కొందరికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. రక్తస్రావం సమస్యలు ఉన్నవారికి లేదా రక్తాన్ని పల్చబరచే మందులు వాడుతున్న వారికి ప్రమాదకరంగా మారుతుంది. సర్జరీ చేయించుకోవాల్సిన వారు శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు నల్ల మిరియాలు తీసుకోవడం మానేయడం మంచిది. ఎందుకంటే ఇది శస్త్రచికిత్స సమయంలో లేదా తరువాత రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.
Also Read: దాల్చిన చెక్కా మజాకా ! ఇలా తింటే.. బోలెడు లాభాలు
గర్భిణులు, పాలిచ్చే తల్లులు:
గర్భిణులు, పాలిచ్చే తల్లులు నల్ల మిరియాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణ వంటకాల్లో ఉపయోగించే మోతాదు సాధారణంగా సురక్షితమే అయినప్పటికీ, అధిక మోతాదులో తీసుకోవడం వల్ల గర్భాశయ సంకోచాలు లేదా ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. పాలిచ్చే తల్లులు నల్ల మిరియాలను అధికంగా తీసుకుంటే పసిబిడ్డలకు కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ దశల్లో ఉన్నవారు వైద్యుడి సలహా మేరకు నల్ల మిరియాలను ఉపయోగించాలి.
మందులతో పరస్పర చర్యలు:
నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ కొన్ని ఔషధాలతో పరస్పర చర్య జరిపే అవకాశం ఉంది. ఇది కొన్ని మందుల శోషణను పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. తద్వారా వాటి ప్రభావంలో మార్పులు కూడా వస్తాయి. ముఖ్యంగా.. యాంటీ బయాటిక్స్, యాంటీ కోయాగ్యులెంట్స్ (రక్తం గడ్డ కట్టకుండా నిరోధించేవి), కొన్ని కాలేయ సంబంధిత సమస్యలకు మందులు తీసుకునేవారు నల్ల మిరియాలు ఎక్కువగా తీసుకునే ముందు డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం.