Mahima Nambiar: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం భారీగా పెరిగిపోయిన తర్వాత హీరోయిన్స్ నిత్యం తమ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫోటోలను, వీడియోలను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇంకొంతమంది విషయంలో అనూహ్యంగా ట్రోల్స్ ఎదురవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అనే విషయం కూడా సెలబ్రిటీలకు అంతుచిక్కడం లేదు. వీటివల్ల వారు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. దీంతో సహించలేక కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినా…ఆకతాయిలు మాత్రం తమ పనులను ఆపడం లేదు అనే చెప్పాలి.. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ అలాంటి వారిపై మండిపడుతూ.. ఏకంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తోంది. మరి ఆమె ఎవరు? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఆమె ఎవరో కాదు మలయాళ క్రేజీ హీరోయిన్ మహిమా నంబియార్ (Mahima Nambiar). ఇటు తమిళంలో కూడా మంచి పేరు దక్కించుకున్న ఈమె మలయాళంలో 50కి పైగా చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ప్రస్తుతం మందాడి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సూరి హీరోగా టాలీవుడ్ హీరో సుహాస్ విలన్ గా నటిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులకు చేరువవుతూ ఉంటుంది. అలాంటి ఈమె గత కొంతకాలంగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రోలింగ్ పై స్పందిస్తూ ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చింది.
ALSO READ:Junior movie OTT: సైలెంట్ గా మరో ఓటీటీలోకి వచ్చిన జూనియర్.. ఇక్కడి పరిస్థితేంటో ?
గట్టి వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్..
ఈ మేరకు ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఒక సుదీర్ఘ పోస్ట్ కూడా పంచుకుంది మహిమ. గత కొన్ని రోజులుగా కొంతమంది నా పేరుతో అసభ్యకరమైన వ్యాఖ్యలతో ఫోటోలు షేర్ చేస్తున్నారు. నా గురించి పూర్తిగా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు. అలాంటి వదంతులను ఇప్పటివరకు సహించాను. మీ వ్యక్తిగత విషయాలలో నేను జోక్యం చేసుకోను. కాబట్టి అదే గౌరవాన్ని మీరు తిరిగి పొందాలనుకుంటున్నాను. పదేపదే అగౌరవ పరిచే వ్యాఖ్యలు నన్ను బాధ పెడుతున్నాయి. ఎవరు ఏమన్నా ఇకపై సహించేది లేదు. ఒకవేళ ఎవరైనా హద్దులు దాటి నాపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు. ఇదే నా చివరి హెచ్చరిక. హద్దులు దాటితే మాత్రం కఠిన చర్యలు తప్పవు.” అంటూ కామెంట్ చేసింది.
అభిమానులు ఏమంటున్నారంటే?
ఈమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారడంతో అభిమానులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మహిమా నంబియార్ ను ట్రోల్స్ చేసింది ఎవరు? ఏ విషయంలో ఆమెను ట్రోల్స్ చేశారు? ఆమె ఇంతలా బాధపడ్డానికి అసలు కారణం ఏమై ఉంటుంది? అంటూ ఇలా పలు కోణాలలో ఆరా తీస్తున్నారు. ఎంత బాధపడి ఉంటే ఇలాంటి వార్నింగ్ ఇస్తుంది అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.