Anam Fires On YS Sharmila: మీ దృష్టిలో టాయిలెట్లు, ఆలయాలు ఒకటేనా అంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిళపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల తన అభిప్రాయం ఏదైనా పార్టీకి సంబంధించి చెప్పొచ్చు కానీ పాలన, పాలకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరం అన్నారు.
‘ఆలయాలు కట్టే బదులు సమాజానికి అవసరమైన టాయిలెట్ లు కట్టాలని సలహాలు ఇస్తారా? టాయిలెట్లు ఆలయాలు ఒకటేనా మీ దృష్టిలో? హిందూమతాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శించడం ప్రతి ఒక్కరికీ అలవాటు అయిపోయింది. మతాన్ని కించపరిచే విధానం మంచి సంస్కృతి కాదు. అలాగే సీఎం చంద్రబాబుపై హేళనగా మాట్లాడటం దారుణం’ -మంత్రి ఆనం
మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి అన్ని మతాలను గౌరవించారని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. అన్ని దేవాలయాలకు వెళ్లి పూజలు చేసేవారని గుర్తుచేశారు. కానీ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు పిల్లలు హిందూ మతాన్ని ప్రతిసారి ద్వేషిస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి అధికారం ఇస్తే హిందూ మతాన్ని దెబ్బ తీసే విధంగా పాలన సాగించారని విమర్శించారు.
అందుకే ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చి గుణపాఠం చెప్పారన్నారు.
“వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉండి, సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, వైసీపీ రాష్ట్రంలో తల ఎత్తుకునే పరిస్థితి లేదు. టీటీడీ నిధులతో 5 వేల గుళ్లు నిర్మిస్తామంటే వైఎస్ షర్మిళకు ఎందుకు అభ్యంతరం. గుళ్లు కట్టించడాన్ని వ్యతిరేకించవచ్చు కానీ బాత్రూంలు కట్టించమని సలహాలిస్తున్నారు. దేవాలయాలు నిర్మించాలని సీఎం సూచిస్తే… ఆయన ఆరెస్సెస్ వారిలా కన్పిస్తున్నారా? టీటీడీకి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని, ధర్మ ప్రచారానికి వివియోగించమని, దేవాలయాల నిర్మాణాలను చేపట్టాలని సీఎం చెబితే మీకు వచ్చిన నొప్పేంటి?” అని మంత్రి ఆనం ప్రశ్నించారు.
దళిత వాడల్లో గుళ్లు నిర్మిస్తే ఇతర మతాలకు నష్టం జరుగుతుందనే ఆందోళనే షర్మిళలో కన్పిస్తోందని మంత్రి ఆనం అన్నారు. సున్నితమైన అంశాలపై మాట్లాడం ద్వారా మతాలు, కులాల మధ్య చిచ్చు రేపే అంశమే షర్మిల వ్యాఖ్యల్లో కనిపించిందన్నారు. వైసీపీ హయాంలో టీటీడీ విరాళాలు పక్క దారి పట్టినప్పుడు షర్మిల ఎందుకు నోరు తెరిచి మాట్లాడలేకపోయారని ప్రశ్నించారు. విరాళాల సొమ్ము దోచుకున్నప్పుడు సైలెంటుగా ఉన్న షర్మిల…. ఇప్పుడు దేవాలయాల నిర్మాణం చేపడతామంటే ఎందుకు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. మత్స్యకారులకు అలర్ట్
మత మార్పిళ్లు చేయడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్లకు దేవాలయాల నిర్మాణం నచ్చకపోవడమనేది ఆశ్చర్యాన్ని కల్గించడం లేదన్నారు. ఇదే సలహాను చర్చికో…మసీదుకో ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. షర్మిల వ్యాఖ్యలు ఆ సొంత విధానమా? పార్టీ విధానమా? చెప్పాలని డిమాండ్ చేశారు.