Manchu Manoj: మంచు వారసుడు మంచు మనోజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన నటిస్తున్న చిత్రాల్లో మిరాయ్ ఒకటి. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిరాయ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.
ఇక ట్రైలర్ లో మంచు మనోజ్ క్యారెక్టర్ ను బట్టి ఇది అతనికి మంచి గుర్తింపును తీసుకొస్తుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఇకపోతే మిరాయ్ సెప్టెంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన తేజ సజ్జా.. భాషతో సంబంధం లేకుండా అన్నిచోట్లకు తిరుగుతున్నాడు. మొన్నటికి మొన్న బాలీవుడ్ లో ఇంటర్వ్యూకు తేజ సజ్జా, జగపతి బాబు, శ్రీయా, రితికా నాయక్ హాజరయ్యారు.
ఇక వారందరూ ఇంటర్వ్యూలలో బిజీగా ఉంటే .. మనోజ్ మరో రకంగా ఈ సినిమాకు హైప్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా మంచు మనోజ్.. సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిశాడు. మంచు మోహన్ బాబు, సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటికి మొన్న కన్నప్ప సినిమా సమయంలో కూడా.. మంచు విష్ణు, రజినీని కలిసి కన్నప్ప సినిమాను మొదట ఆయనకే చూపించడం జరిగింది.
ఇప్పుడు మంచు మనోజ్.. మిరాయ్ కోసం రజినీని కలిశాడు. చెన్నైకి వెళ్లిన మనోజ్.. రజినీ నివాసానికి వెళ్లి ఆయనను కలిశాడు. అనంతరం రజినీకి మిరాయ్ ట్రైలర్ ను చూపించాడు. మిరాయ్ ట్రైలర్ చూసిన రజినీ.. చాలా బావుందని, మనోజ్ నటన అద్భుతంగా ఉండబోతుందని తెలిపినట్లు సమాచారం. ఇక ఈ ఫోటోలను మనోజ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
“మిరాయ్ ట్రైలర్ చూసి మా టీమ్ ను అభినందించిన రజినీకాంత్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. డియర్ బ్రదర్ శివకార్తికేయన్.. మదరాసి సినిమా రిలీజ్ సందర్భంగా నీకు సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. తమిళ మీడియా మాకు సపోర్ట్ గా నిలిచినందుకు థాంక్స్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి మిరాయ్ సినిమాతో మనోజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.