Amitabh Bachchan:బాలీవుడ్ మెగాస్టార్ గా, బిగ్ బీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అమితాబ్ బచ్చన్ కుటుంబంలో ఇప్పుడు ఆస్తి వివాదం నెలకొనడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కోట్ల ఆస్తులకు పడగలెత్తిన అమితాబ్ బచ్చన్ ఇంట్లో ఇప్పుడు ఆస్తి వివాదం ఏంటి? అంటూ నెటిజన్స్ కూడా సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పిలవబడే జుహు ఏరియాలో ఉన్న ఆయన నివాసం ‘జల్సా’ బంగ్లా యాజమాన్యం పై కుటుంబ సభ్యుల మధ్య ఇప్పుడు వివాదం నెలకొన్నట్లు సమాచారం. 1993లో ఈ బంగ్లాను జయ బచ్చన్ (Jaya Bachchan) కు బహుమతిగా బదిలీ చేసినట్లు పేర్కొంటున్న గిఫ్ట్ డీడ్ ను అమితాబ్ బచ్చన్ సోదరుడి భార్య రమోలా బచ్చన్ సవాల్ చేశారు. ముఖ్యంగా తన అనుమతి లేకుండా తనకు తెలియకుండానే ఈ ఆస్తిని జయ బచ్చన్ పేరు మీద బదిలీ జరిగింది అంటూ ఆమె ఆరోపించారు.
అమితాబ్ బచ్చన్ సోదరుడు అజితాబ్ బచ్చన్ భార్య రమోలా గత ఏడు నెలలుగా రిజిస్ట్రేషన్ అధికారులకు ఈ బంగ్లా ఆస్తిపై ఫిర్యాదులు చేశారు. మొదట ఈ బంగ్లాను తన పేరు మీదే రిజిస్టర్ చేశారని, అనంతరం గిఫ్ట్ డీడ్ ద్వారా జయ బచ్చన్ పేరు మీదకు మార్చారని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఫిర్యాదు చివరికి అందేరీలోని డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ కార్యాలయానికి వెళ్లడంతో ఇప్పుడు విచారణ ప్రారంభం అయింది.
జల్సా బంగ్లా యాజమాన్యానికి సంబంధించి కపోల్ హౌసింగ్ సొసైటీ రికార్డుల్లో జయ పేరు ఉన్నట్లు తెలుస్తోంది . అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్టీ కార్డులో మాత్రం ఇప్పటికీ రమోలా పేరు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న తన పేరును తొలగించి ఆస్తిని జయ బచ్చన్ పేరు మీద మార్చేందుకు ప్రయత్నాలు జరగడంతోనే ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 1993 లో రూపొందించిన గిఫ్ట్ డీడ్ చెల్లుబాటుపై రమోలా అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. ఈ గిఫ్ట్ డీడ్ ను ఎటువంటి స్టాంప్ డ్యూటీ చెల్లించకుండా సాధారణ కాగితంపై తయారు చేశారని, పైగా దీనిపైన సాక్షుల సంతకాలు లేవని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభయ్ యోజన పథకం కింద దానిని ఎలా క్రమబద్ధీకరించారు? అసలు ఆ పత్రాన్ని ఎలా రిజిస్టర్ చేశారు? అనే అంశాలపై కూడా రమోలా ప్రశ్నించారు.
also read:గిరిబాబు తెలుగులో నటించిన చివరి చిత్రం ఇదే!
ఈ విషయంపై డిప్యూటీ రిజిస్ట్రార్ ఫైయాజ్ ములానీ మాట్లాడుతూ ఈ వివాదం పైన ఇరువురు తమ వివరణలను సమర్పించాలని ఆదేశించాము.అయితే అమితాబ్ బచ్చన్ ఇప్పటివరకు దీని గురించి స్పందించలేదు. జయ బచ్చన్ ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆమె అందుబాటులోకి రావడం లేదు అని తెలిపారు. మరి దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.