Giribabu:తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గిరిబాబు కన్నుమూశారు. 80 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సుమారు 45 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆయన సినీ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర సంఘటనలు ఇప్పటికీ అభిమానులకు గుర్తుండిపోయాయి. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్‌తో జరిగిన ఓ సంఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
గిరిబాబుకు చిత్ర పరిశ్రమలో వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా మంచి పేరుంది. దర్శకులు, నిర్మాతలు, తోటి నటీనటులతో స్నేహపూర్వకంగా మెలిగేవారు. చిన్నప్పటి నుంచే అలవర్చుకున్న నాయకత్వ లక్షణాలు, అందరితో కలిసిపోయే స్వభావమే తనకు ఈ గుర్తింపును తెచ్చాయని ఆయన పలు సందర్భాల్లో వెల్లడించారు. ఎలాంటి సమస్య ఎదురైనా గొడవలకు వెళ్లకుండా సామరస్యంగా పరిష్కరించుకునేవారని చెప్పారు.
గిరిబాబు గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్, కృష్ణ మధ్య కొన్ని సినిమాల సమయంలో అభిప్రాయ భేదాలు ఉండేవి. ఈ నేపథ్యంలో గిరిబాబు తన తొలి నిర్మాణ ప్రయత్నం ‘దేవతలారా దీవించండి’ విజయవంతం కావడంతో మరో సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. తాను రాసుకున్న ‘సింహగర్జన’ కథకు కృష్ణను ప్రధాన హీరోగా ఎంపిక చేసుకున్నారు.
అదే సమయంలో ఎన్టీఆర్ ‘సింహబలుడు’ అనే జానపద చిత్రాన్ని ప్రారంభించారు. రెండు సినిమాల కథాంశాలు జానపద నేపథ్యంలో ఉండటంతో పాటు టైటిల్స్‌లో ‘సింహ’ అనే పదం ఉండటాన్ని కొందరు తప్పుగా ప్రచారం చేశారు. కృష్ణను హీరోగా పెట్టి ఎన్టీఆర్ సినిమాకు పోటీగా గిరిబాబు చిత్రం తీస్తున్నారని ఆయనకు చెప్పడంతో ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
also read:సైలెంట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్!
ఈ విషయం తెలుసుకున్న గిరిబాబు ఎలాంటి ఆలస్యం చేయకుండా తెల్లవారుజామున ఆరు గంటలకే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న ప్రముఖుల సమక్షంలో ఎన్టీఆర్ తనను ప్రత్యేకంగా గదిలోకి పిలిచి మాట్లాడారని గుర్తుచేసుకున్నారు.
ఆ సమయంలో ఎన్టీఆర్‌తో మాట్లాడుతూ.. ఆయన, అక్కినేని నాగేశ్వరరావు తనకు రెండు కళ్లతో సమానమని, వారిని ఆదర్శంగా తీసుకునే తాను సినీ రంగంలోకి వచ్చానని వివరించారు. వారి పట్ల గౌరవం ఉన్న తనకు వ్యతిరేకంగా సినిమా తీయాలనే ఆలోచన ఎప్పటికీ రాదని స్పష్టం చేశారు.
అనంతరం ‘సింహగర్జన’ కథను కేవలం ఐదు నిమిషాల్లో ఎన్టీఆర్‌కు వివరించారు. కథ విన్న ఆయన రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదని అర్థం చేసుకుని గిరిబాబును అభినందించడంతో పాటు సినిమా బాగా తీయాలని ఆశీర్వదించారు. ఆ తర్వాత విడుదలైన ‘సింహగర్జన’ మంచి విజయాన్ని అందుకోగా, ‘సింహబలుడు’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇలా తనపై వచ్చిన అపోహలను గిరిబాబు తన మాటతీరుతో తొలగించుకున్నారు. ఆయన వ్యక్తిత్వానికి, పెద్దల పట్ల ఉన్న గౌరవానికి ఈ సంఘటన ఓ నిదర్శనంగా నిలిచిపోయింది.