RGV Above Rahman: ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఇటీవల సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న విమర్శలకు స్పందించారు. ‘జై హో’ పాట విషయంలో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ వివాదానికి ముగింపు పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఒక వివరణ ఇచ్చారు.
ఆర్జీవీ మాట్లాడుతూ, ఏ.ఆర్. రెహమాన్ తనకు తెలిసిన గొప్ప సంగీత దర్శకుల్లో ఒకరని, అంతేకాదు తాను కలిసిన వారిలో అత్యంత మంచిమనసున్న వ్యక్తి అని చెప్పారు. ఎవరి కీర్తినైనా దూరం చేసే వ్యక్తి రెహమాన్ కాదని..ఇతరుల క్రెడిట్‌ను తీసుకునే చివరి వ్యక్తి ఆయనేనని స్పష్టం చేశారు. ఈ మాటలతో రెహమాన్‌పై ఉన్న నెగటివిటీకి ముగింపు రావాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల సోషల్ మీడియాలో ఆర్జీవీ ఇచ్చిన పాత ఇంటర్వ్యూ ఒకటి మళ్లీ వైరల్ అయ్యింది. అందులో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాలోని ఆస్కార్ అవార్డు పొందిన జై హో పాట గురించి వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వీడియోలో పాటను సుఖ్విందర్ సింగ్ చేశారని ఆర్జీవీ అన్నట్లు ప్రచారం జరిగింది. దీంతో పెద్ద చర్చ మొదలైంది.
అంతేకాకుండా..ఈ కథనం వెలుగులోకి రావడంతో సంగీత దర్శకుడు రెహమాన్ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే సుఖ్విందర్ సింగ్ మాత్రం తాను ఆ పాటను పాడినంత మాత్రానికే పరిమితమయ్యానని..కంపోజ్ చేసింది రెహమానేనని స్పష్టంగా చెప్పారు. దీంతో చాలా వరకు సందేహాలు తొలగాయి.
అసలు విషయానికి వస్తే..స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి ‘జై హో’ పాటకు సంగీతం అందించినందుకు ఆస్కార్ అవార్డు అధికారికంగా ఏ.ఆర్. రెహమాన్‌కే దక్కింది. ఇది అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందిన నిజం.
తాజాగా ఆర్జీవీ ఇచ్చిన వివరణతో ఈ వివాదం ముగియాలని అభిమానులు భావిస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే.. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన ఈ దర్శకుడు.. ప్రస్తుతం మాత్రం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఈమధ్య ఈ దర్శకుడు నుంచి ఎటువంటి విజయవంతమైన సినిమా రాలేదు. కానీ ఈ మధ్య రాంగోపాల్ వర్మ బ్లాక్ బస్టర్ చిత్రం శివ మళ్ళీ రీ రిలీజ్ అయ్యి అందరి ప్రశంసలు అందుకుంది. ఇక ప్రస్తుతం సినిమాల కన్నా ఎక్కువ ఈ డైరెక్టర్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టే ట్వీట్స్ వల్లే ఎక్కువ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.
ALSO READ: Tollywood No 1 Hero: ఈ జనరేషన్ లో ఈ టాలీవుడ్ హీరో.. నెంబర్ 1 ప్లేస్ ఆక్రమించనున్నారా..!