Sai Pallavi:సినీ ఇండస్ట్రీకి కొందరు వస్తుంటారు పోతుంటారు ,కానీ కొంత మంది మాత్రమే పాతుకుపోతుంటారు.అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ముద్దుగుమ్మ సాయి పల్లవి .స్టార్ హీరోయిన్ అయినా కూడా చాలా సింపుల్‌గా ఉండటం, తనకు నచ్చిన పాత్రలకే ఓకే చెప్పడం ఆమె ప్రత్యేకత అని చెప్పాలి.అలా గ్లామర్ కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఈ నేచురల్ బ్యూటీ ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు తన సత్తా చాటుతోంది.
మలయాళ సినిమా ‘ప్రేమమ్’ (2015) తో హీరోయిన్‌గా పరిచయమైన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత తెలుగులో ‘ఫిదా’ (2017) సినిమాతో భానుమతి పాత్రలో అదరగొట్టి ఒక్కసారిగా టాలీవుడ్‌లో సాలిడ్ క్రేజ్ తెచ్చుకుంది. తెలంగాణ యాసలో ఆమె చెప్పిన డైలాగ్స్, ఆమె నటించి మెప్పించిన తీరుకి ఫిదా అయ్యారు అంతా.
ఆ తర్వాత ‘ఎంసీఏ’ (2017), ‘పడి పడి లేచే మనసు’ (2018), ‘లవ్ స్టోరీ’ (2021), ‘శ్యామ్ సింగ రాయ్’ (2021), ‘విరాట పర్వం’ (2022) లాంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ప్రస్తుతం సాయి పల్లవి నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం‘రామాయణం’. ఈ చిత్రంలో ఆమె సీతమ్మ పాత్రలో కనిపించబోతోంది.ఇక ఎప్పుడు పద్దతిగా, హుందాగా ఉండే సాయి పల్లవి సీత పాత్రలో పర్ఫెక్ట్ సూట్ అవుతుంది అన్నది అభిమానుల ఆలోచన కూడా.
ఇదిలా ఉంటే.. తెలుగులో ‘తండేల్’ (2025) తర్వాత సాయి పల్లవి కొత్త సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా వెళ్తోంది. వరుస సినిమాలు చేయడం కంటే మంచి కథ, గుర్తుండిపోయే పాత్ర ఉంటేనే ఓకే చెబుతానంటుంది.అందుకే ఆమె సినిమాల సంఖ్య తక్కువైనా క్రేజ్ మాత్రం రోజురోజుకీ పెరుగుతోంది.
తాజాగా సాయి పల్లవి మరో మైథాలజీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్నాయి. దర్శకుడు కిషోర్ తిరుమల ఆమెకు ఒక కథ చెప్పారని, ‘అమ్మోరు’ లాగా భక్తి, ఆధ్యాత్మిక అంశాలతో ఈ సినిమా ఉండబోతుందని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఒకవేళ ఈ సినిమా కూడా ఓకే అయితే.. ‘రామాయణం’ తర్వాత సాయి పల్లవి వరుసగా మైథాలజీ పాత్రల్లో కనిపించే హీరోయిన్‌గా నిలుస్తుంది. దేవతా పాత్రలు చేయాలంటే కేవలం అందం మాత్రమే కాదు..అభినయం కూడా చాలా ముఖ్యమని వేరే చెప్పక్కర్లేదు.
మరోవైపు తమిళంలో కూడా సాయి పల్లవి బిజీగా ఉంది. ధనుష్‌తో కలిసి నటిస్తున్న సినిమా, అలాగే మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతితో చేయబోయే ప్రాజెక్ట్‌పై కూడా అంచనాలు ఉన్నాయి. వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం చూస్తుంటే మిగతా హీరోయిన్స్ కి అందకుండా టాప్ స్టార్ గా ఎదిగేలానే కనిపిస్తుంది.
ఏది ఏమైనా వినిపిస్తున్నట్టుగా ‘రామాయణం’లో సీత పాత్రతో పాటు మరో మైథాలజీ సినిమాలో కనిపిస్తే.. ఆమె కెరీర్‌లో ఇది మరో మైల్ స్టోన్ గా నిలిచి పోవడం పక్కా.
also read :అమ్మగా ప్రమోట్ అయిన టాలీవుడ్ బ్యూటీ..పాప ఫోటోలు వైరల్!