Sambarala Yeti Gattu: విరూపాక్ష తర్వాత సాయి దుర్గ తేజ్ నటిస్తున్న చిత్రం సంబరాల ఏటిగట్టు. కొత్త దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా సాయికుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కోసం తేజ్ చాలా అంటే చాలా కష్టపడ్డాడు. 8 ప్యాక్ బాడీ పెంచి మరింత వైల్డ్ గా కనిపించాడు.
మొదట నుంచి ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే అదే రోజు పవన్ కళ్యాణ్ ఓజీ వస్తుండడంతో ఈ సినిమా వాయిదా పడిందని ఎప్పుడో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి దసరాకు షిఫ్ట్ అయిందని, కచ్చితంగా దసరాకు వస్తామని మేకర్స్ తెలిపినట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో సంబరాల ఏటిగట్టు బడ్జెట్ సమస్యలను ఎదుర్కొంటుందని, 100 కోట్లకు పైగా బడ్జెట్ సగం సినిమాకే అయిపోవడంతో మేకర్స్ చేతులెత్తేసారని పుకార్లు వచ్చాయి.
అంతేకాకుండా బడ్జెట్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందని కూడా మాట్లాడుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ పుకార్లను ఖండిస్తూ మేకర్స్ సంబరాల ఏటిగట్టు షూటింగ్ మొదలైందని తెలిపి హైప్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా ఆగిపోలేదని కన్ఫర్మ్ అయ్యింది.ఇక తాజాగా తమ సినిమా వాయిదా పడిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన స్ట్రైక్ తో పాటు సిజి వర్క్ కూడా ఇంకా పూర్తి కాకపోవడంతో తమ సినిమాను వాయిదా వేస్తున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘సంబరాల ఏటిగట్టు మాకు ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ లో ఒకటి. ఇది ఎంతో అద్భుతంగా సిద్ధం చేయబడింది. ఒక శక్తివంతమైన కథ. అంతేకాకుండా భారీ టెక్నాలజీని ఉపయోగించి థియేటర్లో ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని అందించేలా అత్యంత శ్రద్ధతో రూపొందించబడుతుంది. ఈ మధ్య ఇండస్ట్రీలో జరిగిన స్ట్రైక్ వలన కొన్ని ముఖ్యమైన సీజీ పనుల కారణంగా కథకు అవసరమైన నాణ్యత మరియు వైభవాన్ని కాపాడేందుకు మేము ఈ సినిమా రిలీజ్ ను ఆలస్యం చేయాలని నిర్ణయించాము.
మా మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ గారు తన పాత్రను నిజాయితీ మరియు ఎంతో నిబద్ధత, కఠిన శ్రమతో పనిచేశారు. అదేవిధంగా మా దర్శకుడు రోహిత్ కేపీ తన ప్రాణం పెట్టి సంవత్సర కాలం పాటు ఈ సినిమాను బతికించడానికి ప్రయత్నించారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. అందుకే నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా చాలా అద్భుతంగా ఉండేలా చేయాలని ప్రయత్నిస్తున్నాము.
మొదటి నుండి ప్రేక్షకులు, అభిమానులు, మీడియా మాకు సపోర్టుగా నిలిచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీ నమ్మకమే మేము ఎక్కువ కష్టపడి ఏళ్ల తరబడి గుర్తిండిపోయే సినిమాను అందించేందుకు ప్రేరేపిస్తుంది. కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తాము. ఖచ్చితంగా మీకు మేము హామీ ఇస్తున్నాము. మీరు ఎదురు చూసే ప్రతి క్షణంకువిలువ ఉండే సినిమాను అందిస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి సంబరాల ఏటిగట్టు ఏ డేట్ ను ఫిక్స్ చేసుకుంటుందో చూడాలి.