Vijay Devarakonda: లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండకు విజయం అనే మాట దరి చేరలేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తన కెరీర్ లోనే లైగర్ లాంటి డిజాస్టర్ నుంచి బయటపడడానికి విజయ్ దేవరకొండ చేయని ప్రయత్నం లేదు అంటే ఆశ్చర్యం లేదు. పెద్ద పెద్ద డైరెక్టర్స్, బ్యానర్స్.. ఎంతో కష్టపడి సినిమాలు చేసినా కూడా అవేమి విజయ్ కు విజయాన్ని దక్కించలేకపోయాయి. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడు టైపులో ఎలాగైనా ఇండస్ట్రీలో ఒక మంచి విజయాన్ని అందుకొని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని రౌడీ హీరో గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇక ఇందులో భాగంగా తన కెరీర్ ను మలుపు తిప్పి ఒక మంచి విజయాన్ని అందించిన రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన టాక్సీవాలా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది అని తెలియడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది అని సమాచారం.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం రాహుల్ సాంకృత్యాన్ పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తుంది. ఇందులో విజయ్ ను ఢీకొట్టే విలన్ పాత్ర కోసం ఏకంగా హాలీవుడ్ నటుడిని దింపుతున్నట్లు టాక్ నడుస్తుంది. ది మమ్మీ, ది మమ్మీ రిటర్న్స్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో విలన్ గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది.
పాన్ ఇండియా సినిమా కావడంతో సినిమాపై భారీగానే ఖర్చు పెడుతున్నారు మేకర్స్. అందుకే పాన్ ఇండియాకు తగ్గట్టు స్టార్ క్యాస్టింగ్ తో కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. విజయ్ కు దీటుగా ఆర్నాల్డ్ ను తీసుకోవడం మంచి ఎంపిక అని పలువురు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా లైగర్ లా కాకుండా మంచి కథతో వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్ధమవుతుంది. మరి ఈ సినిమాతో నైనా విజయ్ దేవరకొండ ఒక మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.