NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నాడు. ఒకరితో సంబంధం లేకుండా డ్రాగన్ షూటింగ్ ను ముగించేస్తున్నాడు. దేవర సినిమా తరువాత ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటించాడు. తారక్ బాలీవుడ్ డెబ్యూ కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నీ తాకాయి. అందులోనూ హృతిక్ రోషన్ తో స్క్రీన్ ను షేర్ చేసుకోవడం.. స్పై యూనివర్స్ లో సినిమా అనేసరికి ఫ్యాన్స్ ఎన్నో అంచనాలతో సినిమాకు వెళ్లారు. కానీ,వార్ 2 మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది.
సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ఎన్టీఆర్ మళ్లీ మీడియా ముందు కనిపించలేదు. కాలర్ ఎగరేసి మరీ ఫ్యాన్స్ ను తలెత్తుకొనేలా చేస్తాను అని చెప్పిన తారక్.. ఈసారి నిరాశపరిచాడు. దీంతో డ్రాగన్ సినిమా గురించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తోంది.
ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. డ్రాగన్ కోసమే ఎన్టీఆర్ తన లుక్ మొత్తం మార్చేశాడు. బరువు తగ్గి.. కొత్త లుక్ లోకి మారాడు. ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో గ్యాప్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్.. ఈ మధ్యనే ఎలాంటి అప్డేట్ లేకుండా షూటింగ్ మొదలుపెట్టారు.
అంతేకాకుండా అందుతున్న సమాచారం ప్రకారం జనవరి వరకు ఎలాంటి అప్డేట్ ను ఇవ్వకూడదని మేకర్స్ ప్లాన్ చేశారట. అయితే ఇదే ఫ్యాన్స్ ను ఆందోళన చెందేలా చేస్తుంది. దాదాపు నాలుగు నెలలు అసలు ఎలాంటి అప్డేట్ లేదు అంటే ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి..? మధ్యలో చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.. పండగలు వస్తున్నాయి.. పుట్టినరోజులు ఉన్నాయి. అలాంటప్పుడు కూడా తమ హీరో సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా లేకపోతే సోషల్ మీడియాలో మిగతా ఫ్యాన్స్ అందరూ ట్రోల్స్ చేయడం ఖాయం.
ఇలా సైలెంట్ గా పని కానిచ్చేస్తే ఫ్యాన్స్ ఏమైపోతారన్నా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం.. అప్పుడప్పుడు సెట్స్ లో ఫోటోలు కానీ, పోస్టర్లు అయినా రిలీజ్ చేయమని మేకర్స్ ను వేడుకుంటున్నారు. ఈ లెక్కన ఈ నాలుగు నెలలు ఎన్టీఆర్ ఎవరికి కనిపించడు అని తెలుస్తోంది. మరి ఫ్యాన్స్ కోసమైనా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఏమైనా అప్డేట్స్ ఇస్తాడేమో చూడాలి.