AP Students: ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు శుభవార్త చెప్పేసింది చంద్రబాబు సర్కార్. వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కేంద్రం పావలా వడ్డీకి ఇచ్చే రుణాల పథకంతో దీన్ని జత చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీనివల్ల విద్యార్థులు ఉన్నత విద్యలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఇక హ్యాపీగా చదువుకోవచ్చు.
ఉన్నత విద్య అభ్యసించాలని చాలామంది విద్యార్థులు భావిస్తుంటారు. కాకపోతే డబ్బులు లేక చాలామంది మధ్యలో ఆగిపోతారు. ఇకపై విద్యార్థులకు ఆ దిగులు అవసరం లేదు. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి వడ్డీలేని రుణాలిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం అమరావతిలో జిల్లాల కలెక్టర్లు సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
విద్యార్థులకు ఎలాంటి భారం లేకుండా పావలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పావలా వడ్డీకి రుణాలు అందజేస్తోంది. వాటితో ఈ పథకాన్ని అనుసంధానం చేస్తామన్నారు. దీనివల్ల అన్ని వర్గాలవారికి చేయూత ఇవ్వనున్నట్లు తెలిపారు. రుణాల మంజూరుకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 14 ఏళ్లలో ఆ రుణాలను విద్యార్థులు చెల్లించవచ్చు.
నైపుణ్య శిక్షణకు దీన్ని వర్తింప చేయనున్నారు. ప్రభుత్వం నిర్ణయంతో చాలామంది విద్యార్థులకు మేలు జరగనుంది. దీనిపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. కేంద్రం పీఎం విద్యాలక్ష్మి పేరుతో విద్యా రుణాల పథకాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులకు ఏడున్నర లక్షల వరకు రుణం ఇస్తారు. దీనికి ఎలాంటి గ్యారెంటీ ఉండదు. మూడు శాతం వరకు వడ్డీ రాయితీ ఉంటుంది.
ALSO READ: ఏపీలో మహిళలకు తీపికబురు.. ఇకపై నెలకు రూ.1500
దేశంలో మంచి విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఉన్నత చదువు కోసం ఏపీ నుంచి చాలామంది చదువుకుంటున్నారు. వారికి ఇదొక రిలీఫ్ అన్నమాట. ఐఐటీ, ఐఐఎంల్లో చదువుకోవడానికి సహకరిస్తుంది. మరోవైపు అకడమిక్ రికార్డులకు సంబంధించిన అపార్ ఐడీల నమోదులో అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి.
నెలన్నరలో వంద శాతం నమోదు కావాలని ఆదేశించారు. విద్యార్థులు రాసిన పరీక్ష పత్రాలను సాఫ్ట్ కాపీలుగా మార్చి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. జాతీయ విద్యాసంస్థల్లో ఏపీ విద్యార్థులు ఎక్కువగా సీట్లు సాధించేలా ప్రయత్నాలు చేయాలన్నారు. సిలబస్‌ను ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయాలన్నారు. దీనివల్ల జాతీయ స్థాయిలో ఏపీ విద్యార్థులకు మంచి కాలేజీల్లో సీట్లు సంపాదించే అవకాశం ఉందన్నారు.