Telangana Govt: నిధుల సమీకరణకు రెడీ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం. భాగ్యనగరంలోని ఐటీ కారిడార్‌కు సమీపంలోని రాయదుర్గంలో విలువైన ప్రభుత్వ భూములను వేలం వేయాలని డిసైడ్ అయ్యింది. ఎకరాకు కనీస ధర రూ.101 కోట్లుగా ప్రకటించింది అందరి దృష్టిని ఆకర్షించింది. భూముల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2000 కోట్ల ఆదాయం వస్తుందని అధికారుల అంచనా.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రెండేళ్ల కిందట వేలం వేసింది ప్రభుత్వం. కోకాపేటలోని నియోపోలిస్ ఫేజ్- IIలో ఎకరం భూమి రూ.100.75 కోట్లకు విక్రయించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇదొక సంచలనం. ఇటీవల మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో భూముల వేలానికి సంబంధించి చర్చించినట్లు సమాచారం.
తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి సమీపంలో రాయదుర్గం సర్వే నంబర్ 83/1లో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలు ఉన్నాయి. ప్లాట్ నంబర్ 15ఎ/2లో 7.67 ఎకరాలున్నాయి. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ-టీజీఐఐసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వేలంలో పాల్గొనాలనేవారు సంస్థలు/వ్యక్తులు అక్టోబర్ ఒకటి సాయంత్రం 5 గంటలలోపు బిడ్లను దాఖలు చేయాలి. ఆసక్తి కలవారు అక్టోబర్ 4న వేలానికి వచ్చే భూములను సందర్శించేందుకు అవకాశం కల్పించింది టీజీఐఐసీ. వేలం ప్రక్రియ అక్టోబర్ 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో జరగనుంది.
ALSO READ: విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
నాలెడ్జ్ సిటీలో దాదాపు 470 ఎకరాలలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న 100కి పైగా కంపెనీలు ఉన్నాయి. ఈ భూములు దక్కించుకునేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. 101 కోట్ల రూపాయల ప్రారంభ వేలంతో మొదలయ్యే ఈ భూముల్లో విలువ మరింత పెరిగే అవకాశం భావిస్తోంది.
వేలంలో ఒక్కో ఎకరం 150 కోట్ల నుండి 200 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల ఆలోచన. భూముల విక్రయం ద్వారా కనీసం రూ. 2,000 కోట్లు సేకరించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. రాయదుర్గంలో భూముల వేలం రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితిని సూచిస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
డెవలపర్లు-రియల్టర్లు వాదన మరోలా ఉంది. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు మంచి సమయంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి వేలం పాటను ఎంచుకుందని అంటున్నారు. వేలానికి వచ్చే భూములు ఆపిల్, జెపి మోర్గాన్ వంటి కంపెనీలకు దగ్గరగా ఉన్నాయి.
ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్‌పోర్టు, మెట్రో కనెక్టివిటీని కలిగి ఉన్నాయి.అందులో వాణిజ్య, నివాస, వినోద, ఆతిథ్య, వినోద ప్రయోజనాల కోసం భూమి వినియోగించుకోవచ్చని ఓ అధికారి తెలిపారు. విజయ వంతమైన బిడ్డర్లు వారం లోపు లేఖ ఇచ్చి, ఆ మొత్తాన్ని 90 రోజుల్లోపు చెల్లించాలని TGIIC పేర్కొంది.