మాళ మల్లేశ్వర స్వామి అమ్మవారి వివాహం
కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో దసరా రోజు బన్నీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జరిగిన కర్రల సమరం రక్తసిక్తమైంది. నిన్న అర్ధరాత్రి దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి, అమ్మవారి వివాహం జరిగింది. ఆ తర్వాత ఊరేగింపు మొదలైంది. ఈ ఊరేగింపే హింసకు దారితీసింది. దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. రెండు వర్గాలు కర్రలతో ఘర్షణకు దిగాయి.
ఒకవైపు నెరణికి, నెరణికితండా, కొత్తపేట ప్రజలు
దేవతామూర్తులను దక్కించుకునేందుకు నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒకవైపు.. అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల ప్రజలు మరోవైపు కర్రలతో పొట్టుపొట్టు కొట్టుకున్నారు. కసితీరా తలపై దాడి చేసుకున్నారు. ఒక వర్గం రెచ్చిపోతే..మేమేం తక్కువ తిన్నామా అంటూ..మరోవర్గం మరింత రెచ్చిపోయింది. ఈ క్రమంలో అనేక మందికి తలలు పగిలాయి. కాళ్లకు, చేతులు విరిగాయి. అనేకమందికి కాలిన గాయాలయ్యాయి. ఈ దాడుల్లో ముగ్గురు భక్తులు బలయ్యారు. దాదాపు వంద మంది గాయపడ్డారు. అయితే వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది.
నిర్లక్ష్యం ఖరీదు.. ముగ్గురి ప్రాణాలు..! వందల సంఖ్యలో గాయాలు..!
ప్రతీ ఏటా జరిగే బన్నీ ఉత్సవంలో అనేక మంది భక్తులు తీవ్రంగా గాయపడుతుంటారు. ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం, పోలీసు అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు..! ఉత్సవం ప్రారంభానికి ముందు వరకు అన్నీ ఏర్పాట్లు చేశాం.. హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నాం.. పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నాం అంటూ అధికారులు ఊదరగొట్టారు. సీసీ కెమెరాలు, ప్రత్యక్షంగా అధికారుల పర్యవేక్షణ అంటూ.. నానా హడావుడి చేశారు. కానీ ఏం లాభం.. హింస జరగకుండా మాత్రం అడ్డుకోలేకపోయారు. హింసను ఆపలేకపోయారు. నిర్లక్ష్యం ఖరీదు.. ముగ్గురి ప్రాణాలు..! వందల సంఖ్యలో గాయాలు..!
భగ్గుమన్న పాత కక్షలు
ఈ ఉత్సవంలో పాత కక్షలు భగ్గుమన్నట్లు తెలుస్తోంది. వారి మధ్యలో నెలకొన్న గత గొడవలు మనసులో పెట్టుకుని…కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసుకున్నట్లు సమాచారం. కొందరు ముందే ప్లాన్ వేసుకుని…ఈ ఉత్సవానికి హాజరయ్యారని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే పకడ్బందీ బందోబస్తు నిర్వహించినా..అసాంఘిక శక్తులను మాత్రం పోలీసులు అడ్డుకోలేకోయారన్నది వాస్తవం. హింస జరిగే అవకాశం ఉందని తెలిసినా..గత అనుభవాలు ఉన్నా..పోలీసులు మాత్రం సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?
ఒంటికి అయిన గాయాలు..నెల రోజులు..లేదంటే నాలుగైదు నెలల్లో మానిపోతాయ్. మరి పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా..? ఈ దారుణానికి ఎవరు బాధ్యత వహించాలి..? అంటే సమాధానం ఎవరి నుంచి రాదు..రాలేదు..! ప్రాణాలు పోయాయి కాబట్టి.. ప్రభుత్వం.. అధికారులు నోటికివచ్చి బుజ్జగింపు మాటలు చెప్పి చేతులు దులుపుకుంటారు. అక్కడికి వచ్చి సమరంలో పాల్గొన్న జనం నాలుగు రోజులైతే ఈ సంఘటను పూర్తిగా మర్చిపోతారు. కానీ ప్రాణం పోయిన వ్యక్తి కుటుంబం మాత్రం.. జీవితాంతం ఆ బాధను అనుభవించాల్సిందే..! ఈ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకునే ఈ ఉత్సవం ఎందుకోసం ? అన్న చర్చ మొదలైంది. ప్రాణాలు బలితీసుకునే సమరం ఎవరికోసం అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
రక్తం చిందించాలని దేవదేవుడే ఆదేశించాడా..?
ముగ్గురి ప్రాణాలు..వందల మందికి గాయాలు..బాధితుల ఆర్తనాదాలు.. కుటుంబాల శోకాలు.. ఇవన్నీ కళ్లారా చూస్తే ఆగవు కన్నీళ్లు. ఈ విషాదానికి కారణం ఓ సంప్రదాయం. ఈ ఘటనకు మూలం వందల ఏళ్ల క్రితం జరిగిన ఓ కథనం. అసలు చంపుకునే ఆనవాయితీ ఎలా వచ్చింది..? కర్రలతో కొట్టుకోవాలని ఎవరు చెప్పారు..? బలి ఇవ్వమని మాళ మల్లేశ్వరుడే అడిగాడా..? రక్తం చిందించాలని దేవదేవుడే ఆదేశించాడా..?
వందల ఏళ్ల నుంచి కర్రల సమరం
కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి దసరా పండగ రోజు రాత్రి కర్రల సమరం వందల ఏళ్ల నుంచి జరుగుతోంది. దేవరగట్టు వద్ద కొండపై వెలిసిన మాళమల్లేశ్వరస్వామి ఆలయంలో దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరస్వామికి దసరా పండుగన అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం జరిపిస్తుండటం ఆనవాయితీ. ఈ కల్యాణం అనంతరం కొండ పరిసరాల్లోని ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం వాటి ఎదురుగా ఉన్న బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. ఆ విగ్రహాలను దక్కించుకోవడం కోసం నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒక జట్టుగా కడతారు. ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, నిడ్రవట్టి, అరికెర, బిలేహాల్ గ్రామస్థులు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడతారు. దీన్నే బన్ని ఉత్సవం అని కూడా పిలుస్తారు.
యజ్ఞాలకు అడ్డుతగిలిన మణి, మల్లాసుర
త్రేతా యుగంలో దేవరగట్టు కొండల్లో మహర్షులు లోక కల్యాణం కోసం యజ్ఞాలు చేశారు. మణి, మల్లాసుర అనే రాక్షసులు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. రాక్షసుల ఆగడాలు భరించలేకపోయిన మునులు, తమను రక్షించమని శివపార్వతులను వేడుకుంటారు. మునుల విన్నపాన్ని ఆలకించిన ఆదిదంపతులు, మాళ, మల్లేశ్వరులుగా అవతరించి మణి, మల్లాసుర రాక్షసులతో భీకరంగా పోరాడారు. నరుడి చేతిలో మరణం లేకుండా వరం పొందిన ఆ రాక్షసులతో యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. చివరికి, శివుడి చేతిలో మరణించడం తమ అదృష్టంగా భావించిన రాక్షసులు..చనిపోయే ముందు, ప్రతి ఏటా తమకు నరబలి ఇవ్వాలని దేవదేవుడిని కోరారు.
నరబలిని నిరాకరించిన ఆదిదంపతలు
నరబలిని నిరాకరించిన ఆదిదంపతలు.. దానికి బదులుగా ప్రతి విజయదశమికి కురువ కులానికి చెందిన గొరవయ్య ఐదు చుక్కల రక్తాన్ని ఇస్తాడని దేవుడు అభయమిచ్చాడు. ఆ తర్వాత రాక్షస సంహారం జరుగుతుంది. దేవుడి ఆదేశంతో గొరవయ్య..తన కాలిపిక్కలో దబ్బణంతో ఒకవైపు నుంచి మరోవైపు లాగుతాడు. అప్పుడు ఐదు చుక్కల రక్తం పడుతుంది. ఆ రక్తాన్ని రాతి గుండ్లకు విసురుతుంటారు. ఉదయంలోపు రక్తపు మరకలను రాక్షసులు సేవిస్తారని నమ్ముతుంటారు. రాక్షసుల సంహారంతో అప్పటి నుంచి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రతీ ఏటా విజయదశమి రోజున ఇక్కడ బన్ని ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో ప్రతిసారి కర్రలతో కొట్లాడుకుంటూ.. రక్తం చిందడంగా ఆనవాయితీగా మారింది.
నరబలి జరగొద్దని చెప్పిన పరమేశ్వరుడు
దేవరగట్టు చరిత్ర ప్రకారం.. నరబలి జరగొద్దని స్వయంగా పరమేశ్వరుడే రాక్షసులకు చెప్పినట్లుగా విన్నాం. కానీ ప్రస్తుతం జరుగుతుందేంటి..? ఏటా ఎంత మంది ఈ మూఢనమ్మకానికి బలవుతున్నారు. ఐదు చుక్కల రక్తం చిందించమని ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి శివుడు ఆదేశమిచ్చినట్లు ఇక్కడి చరిత్ర చెబుతోంది. మరి వందల సంఖ్యలో కర్రలతో దాడులు చేసుకోమని..చంపుకోమని ఏ దేవుడు చెప్పాడు..? ఇలాంటి ప్రాణాలు తీసే ఉత్సవానికి ప్రభుత్వాలు ఎందుకు అనుమతులిస్తున్నాయి..? రక్తపాతం జరుతుందని తెలిసినా..వాటిని అడ్డుకుని..సరైన సంప్రదాయాలు పాటిస్తూ..ఉత్సవాలను నిర్వహించేలా ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు..? తాజా ఘటనతో ఇలాంటి ప్రశ్నలు అందరి మదిలో రేకెత్తుతున్నాయి.
ప్రాణ.. రక్తతర్పణం చేయడం సమంజసమేనా..?
దసరా రోజున జరిగిన బన్ని ఉత్సవంలో ముగ్గురు బలయ్యారు. వీరి ప్రాణాలతో ఎవరికి ప్రయోజనం చేకూరింది..? ఇలా కుటుంబాలను అనాథలు చేసి.. ప్రాణ.. రక్తతర్పణం చేయడం సమంజసమేనా..? అయితే బన్ని ఉత్సవాల్లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానాలు పలుమార్లు ప్రభుత్వాలకు అనేక ఆదేశాలు జారీ చేశాయి. ఉత్సవాల్లో హింసను అరికట్టాలని.. సంతోషంగా.. ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది.
భక్తిభావం వెల్లివిరిసేలా సంప్రదాయలను పాటిస్తూ
దేవరగట్టు బన్ని ఉత్సవం గ్రామీణ విశ్వాసాలు, భక్తి, పూర్వీకుల ఆచారాల పట్ల ఉన్న లోతైన అనుబంధాన్ని చాటుతూనే, ఆధునిక సమాజానికి ఒక సవాలును విసురుతున్నాయి. అయితే సంప్రదాయాన్ని గౌరవించడంలో..వాటిని పాటించడంలో తప్పులేదంటున్నారు పండితులు.. విశ్లేషకులు. కానీ అందులోని హానిని తగ్గించే మార్గాలను అన్వేషించాలని సూచిస్తున్నారు. హింస, ప్రాణాలు బలిగొనే ఉత్సవాలు కాకుండా.. భక్తిభావం వెల్లివిరిసేలా సంప్రదాయలను పాటిస్తూ.. ఉత్సవాలను నిర్వహించాలని అంటున్నారు.
Story By Kishan, Bigtv Live