భారతీయ పరిసర దేశాల్లో చైనాను మినహాయిస్తే, మరెక్కా అత్యాధునిక రైళ్లు అందుబాటులో లేవు. భారతీయ రైల్వే వందేభారత్ రైళ్లలో ప్రయాణీకులకు అత్యాధునిక సౌకర్యాలు అందిస్తోంది. ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు కూడా ఇవే కావడం విశేషం. అయితే, ఈ రైళ్లలో టికెట్ కాస్ట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఇండియాతో పోల్చితే మయన్మార్ లో రైలు ప్రయాణం సామాన్యులకు మరింత అందుబాటులో ఉంది. తక్కువ ధరలో ప్రయాణ అవకాశాన్ని కల్పిస్తోంది. తాజాగా ఓ ఇండియన్ ట్రావెలర్ మయన్మార్ లో ఫస్ట్ క్లాస్ ట్రైన్ జర్నీకి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే..
సాధారణంగా ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం అనగానే సాధారణంగా లగ్జరీ సీట్లు, ఎయిర్ కండిషనింగ్, చక్కటి ఫుడ్ ఊహించుకుంటాం. కానీ, మయన్మార్ రైలు ప్రయాణం కాస్త డిఫరెంట్ గా ఉంది. అక్కడ ఫస్ట్ క్లాస్ జర్నీ విలాసవంతమైనది కాకుండా సింపుల్ కంపార్ట్ మెంట్ లా ఉంది. సదరు ట్రావెలర్ ఈ రైల్లో దాదాపు 500 కి.మీ ప్రయాణించినట్లు వెల్లడించాడు. సీట్లు అంత లగ్జరీగా లేకపోయినా, సౌకర్యవంతంగా ఉన్నట్లు చెప్పాడు. పెద్ద కిటికీలు ప్రయాణ సమయంలో ప్రయాణీకులకు మరింత ఆహ్లాదాన్ని పంచుతున్నట్లు వివరించాడు. బీరు, విస్కీ, బ్రాందీ లాంటి డ్రింక్స్ సహా ఆహారం అందుబాటులో ఉన్నట్లు వెల్లడించాడు. వీటన్నింటి ఖర్చు కేవలం రూ. 350 అని చెప్పుకొచ్చాడు.
మయన్మార్ రైలు ప్రయాణం గురించి ఇండియన్ ట్రావెలర్ కీలక విషయాలు వెల్లడించాడు. “ప్రస్తుతం, నేను మయన్మార్ రైల్వేలోని ఫస్ట్ క్లాస్ రైలులో ప్రయాణిస్తున్నాను. ఇది ఇండియన్స్ కు ఫస్ట్ క్లాస్ కాకపోవచ్చు. కానీ.. మయన్మార్ ప్రజలకు ఇది ఫస్ట్ క్లాస్. నేను ఈ రైల్లో మొత్తం 350 మైళ్లు ప్రయాణిస్తాను. ఈ ప్రయాణానికి సుమారు 20 గంటల సమయం పడుతుంది. ఈ రైల్లో డ్రింకింగ్, స్మోకింగ్ కూడా చేసే అవకాశం ఉంది. ఈ రైల్లో ఫుడ్ తో పాటు డ్రింక్స్ కూడా లభిస్తాయి. బీరు, విస్కీ, బ్రాందీ కూడా అందిస్తారు. 20 గంటల మొత్తం ప్రయాణానికి జస్ట్ రూ. 350 వసూలు చేశారు. రైల్లో నుంచి బయట అందమైన దృశ్యాలను చూడవచ్చు. అయితే, ఫస్ట్ క్లాస్ ప్రయాణం అయినా రైల్లో ఏసీ అనేది ఉండదు” అని వివరించాడు.
ఇక ఈ రైలు జర్నీ గురించి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. “మన భారతీయ రైళ్లు దీని కంటే చాలా బెటర్ గా ఉన్నాయి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఈ రైల్లో స్మోకింగ్ కోసం ఓ ప్లేస్ ఉండటం బాగుంది. ఇండియాలోని రైళ్లలో ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆ అవకాశం లేకపోవడం వల్లే చాలా మంది టాయిలెట్ లో పొగతాగుతున్నారు” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Read Also: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!