Fruitarian Diet: మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు అన్ని మనకు చాలా అవసరం. కొన్ని ఆహార విధానాలు తాత్కాలికంగా ఆకర్షణీయంగా కనిపించినా, రాను రాను అవి శరీరానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి. అలాంటి ఒక ఆహార విధానం ఫ్రూటేరియన్ డైట్. ఈ డైట్‌లో కేవలం పండ్లపైనే ఆధారపడతారు, కూరగాయలు, ధాన్యాలు, ప్రోటీన్, కొవ్వులు వంటి ఇతర ముఖ్యమైన ఆహారాలను పూర్తిగా మానేస్తారు.
ఈ డైట్ కారణంగా ముందు బరువు తగ్గడానికి సహాయపడినట్లు అనిపిస్తుంది, కానీ ఇది శరీరంలో తీవ్రమైన పోషకాహార లోపాలకు దారితీస్తుంది. రక్తంలో అల్బుమిన్ స్థాయిలు పడిపోవడం, ఎముకలు బలహీనపడడం, కణజాలాల పనితీరు క్షీణించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ డైట్ యొక్క ప్రమాదకర స్వభావాన్ని స్పష్టంగా చూపించే ఒక దురదృష్టకర ఉదాహరణ కరోలినా క్రిజాక్ అనే యువతి కథ.
ఫ్రూటేరియన్ డైట్ అంటే ఏమిటి?
పోలాండ్‌కు చెందిన 27 ఏళ్ల కరోలినా, 2024 డిసెంబర్‌లో బాలిలోని సుంబెర్కిమా హిల్ రిసార్ట్‌లో ఉండటం ప్రారంభించింది. ఆమె గతంలోనే ఆరోగ్య సమస్యలతో బాధపడింది. చిన్న వయస్సులోనే శరీర ఆకృతిపై అసంతృప్తి, అనోరెక్సియా వంటి సమస్యలతో సతమతమైన ఆమె, యుకేలో చదువుకునే సమయంలో యోగా మరియు వీగనిజం వైపు ఆకర్షితయ్యింది. చివరికి, ఆమె అత్యంత కఠినమైన ఫ్రూటేరియన్ డైట్‌ను ఎంచుకుంది.
డైట్ కారణంగా అందవికారంగా మారిన కరోలినా
ఇలాంటి డైట్ కారణంగా కరోలినా బరువు విపరీతంగా తగ్గింది. దీనివల్ల ఆమె శరీరం తీవ్రంగా బలహీనమైంది. ఆమె కళ్ళు గుంతలు ఏర్పడ్డాయి, ఆమె శరీరంలోని ఎముకలు బయటకు స్పష్టంగా కనిపించాయి. దాని వల్ల ఆమె నడవలేని స్థితికి వచ్చింది. అడుగు తీసి అడుగు వేయలేని ఆమెను రిసార్ట్ సిబ్బంది గమనించి గదికి తీసుకెళ్లవలసి వచ్చింది. ఆమె గోళ్లు పసుపు రంగులోకి మారాయి, దంతాలు కుళ్లిపోయాయి, శరీరం మొత్తం పోషకాహార లోపం వల్ల క్షీణించిపోయింది. దీని వల్ల కరోలినా అందవికారంగా మారిపోయింది. ఇవన్నీ ఆమె ఆరోగ్యం ఎంత దయనీయ స్థితిలో ఉందో తెలియజేసింది.
Also Read: Samsung 5G Smartphone: సామ్‌సంగ్ కొత్త 5G ఫోన్.. అద్భుత ప్రీమియం డిజైన్‌తో లాంచ్
కరోలినా మృతి మూడు రోజుల తరువాత బయటకు!
హోటల్ సిబ్బంది ఆమెను వైద్య సహాయం తీసుకోమని పలుమార్లు కోరినప్పటికీ, కరోలినా ప్రతిసారీ నిరాకరించింది. ఏమీ చేయలేక హోటల్ సిబ్బంది ఆమె గది నుంచి వెళ్లిపోయారు. మూడవ రోజున హోటల్ సిబ్బందికి కాల్ వచ్చింది.. కరోలినా ఫోన్ లిప్ట్ చేయడం లేదని ఒక స్థానిక స్నేహితురాలు తెలియజేసింది. దీంతో హోటల్ సిబ్బంది వెంటనే ఆమె గదిని తనిఖీ చేశారు. అక్కడ కరోలినా కదలని స్థితిలో కనిపించింది. వెంటనే వైద్యులకు సంప్రదించారు. వైద్యులు పరీక్షించిన తర్వాత, ఆమె మరణానికి తీవ్రమైన పోషకాహార లోపం కారణమని నిర్ధారించారు.
డైట్ కారణంగా కరోలినా బరువు ఎంతో తెలుసా?
మరణం సమయంలో కరోలినా బరువు కేవలం 22 కిలోలు మాత్రమే ఉంది. వైద్య నివేదికల ప్రకారం, ఆమెకు అల్బుమిన్ లోపం, ఆస్టియోపోరోసిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఫ్రూటేరియన్ డైట్ వల్ల సంభవించినవే.
కరోలినా ఎందుకు డైట్ చేసింది?
కరోలినా చిన్నప్పటి నుండి శరీర ఆకృతిపై అసంతృప్తి, బాడీ ఇమేజ్ సమస్యలతో బాధపడింది. యోగా, వీగనిజం ఆమె దృష్టిని ఆకర్షించాయి. ఆమె డైట్ ప్రారంభించినప్పుడు అందగా ఉన్నా రాను రాను శరీంలో మార్పులు మొదలయ్యాయి. అయినా కరోలినా డైట్ వదలలేదు. చివరికి ఆమె ఈ అతివాద ఫ్రూటేరియన్ డైట్‌ను అనుసరించింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెను ఈ మార్గం నుండి వెనక్కి తీసుకురావడానికి, వైద్య సహాయం తీసుకోమని ఎన్నిసార్లు కోరినా, ఆమె వారి సలహాలను పట్టించుకోలేదు. దురదృష్టవశాత్తూ, ఈ కఠినమైన ఆహార విధానం ఆమె ప్రాణాలను తీసింది.
డైట్ హెచ్చరిక
కరోలినా కథ మనకు ఒక గట్టి హెచ్చరిక. పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నది నిజమే, కానీ కేవలం పండ్లపై మాత్రమే ఆధారపడటం అత్యంత ప్రమాదకరం. సమతుల్యమైన ఆహారం, కూరగాయలు, ధాన్యాలు, ప్రోటీన్లు, కొవ్వులు మన శరీరానికి తప్పనిసరి. ఫ్రూటేరియన్ వంటి అతివాద ఆహార విధానాలు తాత్కాలికంగా ఆకర్షణీయంగా కనిపించినా, దీర్ఘకాలంలో శరీరాన్ని నాశనం చేస్తాయి. ఆరోగ్యం కోసం ఆహారం, వైద్య సలహాలను తీసుకోవడం మంచిది.