Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయ్యింది తెలంగాణ ఎన్నికల కమిషనర్. శనివారం రాత్రి రిజర్వేషన్లు ఖరారు చేసింది పంచాయితీ రాజ్. అందులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఈ జాబితాను రెడీ చేసింది. జెడ్పీ ఛైర్ పర్సన స్థానాలను బీసీలకు 13, ఎస్సీలు-6, ఎస్టీలు-4, మిగిలిన 8 స్థానాలకు జనరల్ కేటగిరికి కేటాయించారు.
ఇప్పటికే గ్రామ పంచాయతీ, ఎంపీటీపీ, జెడ్పీటీసీ సీట్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. దీంతో సోమవారం లేకుంటే మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనుంది తెలంగాణ ఈసీ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దశల్లో నిర్ణయించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక దశలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచన. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో 1,67,03,168 మంది గ్రామీణ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రణాళికను రెడీ చేసింది. తెలంగాణలో 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 1,12,534 వార్డులు ఉన్నాయి. ఇక ఎంపీటీసీ స్థానాలు 5,763 కాగా, జడ్పీటీసీలు 565 వరకు ఉన్నాయి. ఓటర్లు సభ్యులను ఎన్నుకుంటారు. మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు- 565 కాగా, జడ్పీ ఛైర్‌పర్సన్-31 ఉన్నాయి. వీటికి పరోక్షంగా ఎన్నికలు జరుగుతాయి.
ALSO READ: తీరం దాటిన అల్పపీడనం.. మరో రెండురోజులు నాన్‌స్టాప్ వర్షాలు
గ్రామీణ ప్రాంతాల్లోని 1,67,03,168 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 85,36,770 మంది మహిళలు ఉన్నారు. 81,65,894 మంది పురుషులు మాత్రమే ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్ల ఎక్కువ. వంద శాతం ఎస్టీ లున్న పంచాయతీలు 1,248 ఉన్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 1,289 ఉండగా, ఇతర ప్రాంతాల్లో 10,223 పైగా ఉన్నాయి.
పంచాయతీ ఎన్నికలు తొలి దశలో 41 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలిదశలో జడ్పీటీసీలు-290, ఎంపీటీసీలు-2,977 సీట్లకు ఉన్నాయి. రెండో దశలో జడ్పీటీసీలు-275, ఎంపీటీసీలు-2,786 సీట్లకు, 5,910 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడో దశలో 252 మండలాలు 5,752 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 31 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది ఈసీ. అందులో సమస్యాత్మక ప్రాంతాల్లో 8,123 కాగా, అతి సున్నితమైనవి 8,113 ఉన్నాయి. అత్యంత సున్నితమైనవి 515 కేంద్రాలున్నాయి. ఇక పంచాయతీ పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మకమైనవి 19,774 కాగా, అతి సున్నితమైన ప్రాంతాల్లో 21,093 , అత్యంత సున్నితమైనవి 2,324 కేంద్రాలు ఉన్నాయి.
తెలంగాణలో గుర్తింపు పొందిన పార్టీలు 11 ఉన్నాయి. 31 నమోదు పార్టీలు ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఆయా పార్టీల గుర్తులపై ఎన్నికలు జరుగుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం పార్టీలకు అతీతంగా అంటే అభ్యర్థుల సొంత గుర్తులపై ఎన్నికలు జరగనున్నాయి.