Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. లైగర్ లాంటి భారీ పరాజయం తర్వాత ఇప్పటివరకు విజయ్ ఒక మంచి విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు. మధ్యలో మూడు సినిమాలు వచ్చినా అవేమి కనీసం విజయ్ ను నిలబెట్టలేకపోయాయి. ఇక ఇప్పుడు విజయ్ ఆశలన్నీ కింగ్డమ్ మీదనే పెట్టుకున్నాడు. జెర్సీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవరనాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక కింగ్డమ్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను కూడా అమాంతం పెంచేసాయి. ఇకనేడు ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరగనున్నాయి. ఎన్నో వాయిదాల తర్వాత కింగ్డమ్ జూలై 31న రిలీజ్ కు రెడీ అవుతుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నాడు. కింగ్డమ్.. ఇద్దరు అన్నదమ్ముల కథ. ఇందులో విజయ్ కు అన్నగా సత్య దేవ్ కనిపించాడు. ఈ సినిమా నుంచి రిలీజైన అన్నా అంటే సాంగ్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెల్సిందే. ఆ తరువాత ఆ సాంగ్ గురించి దేవరకొండ బ్రదర్స్ విజయ్, ఆనంద్ కూడా చెప్పుకొచ్చారు.
ఇక ఇండస్ట్రీలోస్టార్ హీరోలైన సూర్య , కార్తీ అన్నదమ్ములు అనే విషయం తనకు తెలియదని విజయ్ చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. “గజిని మూవీ చూసినప్పటి నుంచి సూర్యకు నేను పెద్ద ఫ్యాన్ గా మారిపోయాను. ఆయన యాక్టింగ్, డ్యాన్స్ చూసి ఫిదా అయిపోయేవాడిని. మొదటినుంచి ఆయనలా నటించాలని అనుకునేవాడిని. అంతేకాకుండా సినిమాల్లోకి వచ్చాక ఆయనలా అవ్వాలని కోరుకునేవాడిని. సూర్య, కార్తీ ఇద్దర్నీ చూసినప్పుడు వీరిద్దరికీ దగ్గర పోలికలు ఉండేవి అనిపించేది. నా ఫ్రెండ్స్ దగ్గర అదే విషయాన్ని చెప్తే వాళ్లిద్దరూ అన్నదమ్ములు అని చెప్పారు. అయినా కూడా నేను నమ్మలేదు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కాదు అంటూ వాదించేవాడిని. ఆ తరువాత అసలు నిజం తెలిసింది. చాలాసార్లు సూర్యని, కార్తీని కలవాలని ప్రయత్నించినట్లుతెలిపాడు.
ఇక ఈ మధ్యనే విజయ్ తన కోరికను నెరవేర్చుకున్నాడు. సూర్య నటించిన రెట్రో సినిమా ఈవెంట్ కు విజయ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అప్పుడు కూడా విజయ్ అదే చెప్పాడు. సూర్య ను కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఆయనను తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ వ్యాఖ్యలు నెట్టింట్ వైరల్ గా మారాయి. మరి ఈసారి విజయ్ కింగ్డమ్ తో హిట్ అందుకుంటాడా..? లేదా అనేది తెలియాలంటే ఇంకో వారం రోజులు ఆగాల్సిందే.