Vande Bharat vs Amrit Bharat: ఇండియన్ రైల్వే ఎప్పుడూ ప్రయాణికుల సౌకర్యాలను పెంచే మార్గాల్లో కొత్త ఆవిష్కరణలకు ముందుంటుంది. ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లాంటి ఆధునిక రైళ్లు దేశవ్యాప్తంగా ప్రయాణికుల మనసులు గెలుచుకున్నాయి. అయితే, అందరికీ సరసమైన ధరలో మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో రైల్వే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ రెండు రైళ్ల మధ్య ఉన్న తేడాలు, ప్రయోజనాలు, టికెట్ ధరలు, ప్రస్తుత పరిస్థితి, నెక్స్ట్ రైల్వే ప్లాన్ ఏమిటో తప్పక తెలుసుకోవాల్సిందే.
❂ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. వేగం, లగ్జరీకి బ్రాండ్
2019లో ప్రారంభమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భారతదేశపు మొదటి సెమీ – హైస్పీడ్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (EMU) రైలు. పూర్తిగా AC కోచ్‌లతో కూడిన ఈ రైల్లో చైర్ కార్లు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు ఉంటాయి. గంటకు 160 కి.మీ వేగం వరకు ట్రాక్ పై దూసుకుపోగలదు. ఎయిర్‌లైన్ తరహా సీట్లు, LED లైటింగ్, Wi-Fi, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లు, ఆటోమేటిక్ డోర్లు, బయో-టాయిలెట్లు వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. యమస్పీడ్, లగ్జరీ ప్రయాణం కోరుకునే వారికి వందే భారత్ రైళ్లు అత్యుత్తమ ఎంపిక. టికెట్ రేట్లు సాధారణంగా రూ. 900 నుంచి రూ. 3000 వరకు ఉంటాయి.
❂ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. సాధారణ ప్రయాణికుల కోసం
వందే భారత్ రైళ్లు కేవలం AC సీటింగ్‌తో ఉండటంతో, సాధారణ ప్రయాణికులకు అవి అందుబాటులో లేకపోయాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొచ్చింది. ఇది push – pull టెక్నాలజీతో నడిచే నాన్-AC రైలు. ఈ రైల్లో 12 స్లీపర్ కోచ్‌లు, 8 జనరల్ కోచ్‌లు ఉంటాయి. సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే సీటింగ్ కంఫర్ట్, సేఫ్టీ, రైడ్ క్వాలిటీ మరింత మెరుగ్గా ఉంటుంది. మొబైల్ చార్జింగ్ పాయింట్లు, సీసీటీవీ కెమెరాలు, రాత్రిపూట రేడియం లైటింగ్, బయో-టాయిలెట్లు వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.
❂ టికెట్ ధరలలో తేడా
వందే భారత్‌లో టికెట్ ధరలు ఎక్కువగా ఉండటానికి కారణం AC సౌకర్యాలు, వేగం, ఫుడ్ సర్వీసులు. మరోవైపు అమృత్ భారత్ రైళ్లలో ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, 1-50 కి.మీ ప్రయాణానికి స్లీపర్ టికెట్ రూ. 65, జనరల్ టికెట్ రూ. 30 మాత్రమే. ఇది సాధారణ ఎక్స్‌ప్రెస్ రైలుతో పోలిస్తే కేవలం 15 నుండి 17శాతం మాత్రమే ఎక్కువ. అందుకే సాధారణ బడ్జెట్ ప్రయాణికులకు ఇది మంచి ఎంపిక.
❂ సౌకర్యాల తేడా.. ఎవరు ఏది ఎంచుకోవాలి?
వందే భారత్ రైళ్లు లగ్జరీ ట్రావెల్ కోరుకునే వారికి బాగుంటాయి. AC చైర్ కార్లు, Wi-Fi, KAVACH సేఫ్టీ టెక్నాలజీ, ఆటోమేటిక్ డోర్లు, LED రీడింగ్ లైట్స్, ఫుడ్ సర్వీస్ ఈ సౌకర్యాలన్నీ ఇక్కడ లభిస్తాయి. అమృత్ భారత్ రైళ్లు బడ్జెట్-ఫ్రెండ్లీ. Non-AC స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లు, లగేజీ రాక్స్, సీసీటీవీ, సెన్సర్ ట్యాప్స్ వంటి సౌకర్యాలతో సాధారణ ప్రయాణికులకు అనుకూలంగా ఉంటాయి.
❂ ప్రయాణికులకు లాభమేంటి?
వందే భారత్‌లో ప్రయాణం అంటే వేగం, సౌకర్యం, టైమ్ సేవింగ్. అమృత్ భారత్ రైళ్లు సాధారణ ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో కొత్త అనుభవం అందిస్తాయి. రైల్వే రెండు వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టులను రూపొందించింది.
❂ ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు, రాబోయే ప్రణాళికలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందే భారత్ 70 సర్వీసులు నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని రైళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం 5 అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయి. రాబోయే సంవత్సరంలో 50కి పైగా కొత్త అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి.
ఇండియన్ రైల్వే ఇప్పుడు ప్రతి ప్రయాణికుడి అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని విభిన్న సౌకర్యాలను అందిస్తోంది. లగ్జరీతో వేగవంతమైన ప్రయాణం కోరుకునే వారు వందే భారత్ ఎంచుకుంటే, తక్కువ ఖర్చుతో సౌకర్యాలను కోరుకునే వారు అమృత్ భారత్‌లో ప్రయాణించవచ్చు. ఇది కేవలం రైలు ప్రయాణంలో కాదు, దేశ రవాణా రంగంలో ఒక కొత్త విప్లవం అని చెప్పవచ్చు.