UP Alliance: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలు కలిసి కూర్చుని సీట్ల సర్దుబాటుపై ఒక నిర్ణయానికి వస్తాయని పేర్కొన్నారు. అయితే అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు పొత్తుకు కట్టుబడి ఉన్నాయని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న బలమైన అభ్యర్థులను సంయుక్తంగా గుర్తిస్తామన్నారు. ఇండియా కూటమిలో చీలికలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని సైతం ఆయన కొట్టిపారేశారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? ప్రచారాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి? అనే విషయాలను ఎస్పీ, కాంగ్రెస్ కలిసి నిర్ణయిస్తాయని ఆయన పేర్కొన్నారు.
వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు కలయికతో కూడిన ‘పీడీఏ’ (PDA) వ్యూహంతోనే కూటమి పనిచేస్తుందని అఖిలేష్ స్పష్టం చేశారు. ఎన్నికల కోసం తమ పార్టీ ఎప్పటినుంచో సన్నద్ధమవుతోందని బీజేపీని ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో పీడీఏ వ్యూహం కింద ఇండియా కూటమి అభ్యర్థులు బరిలో ఉంటారని, ఆ దిశగా తమ పార్టీ నిరంతరం పనిచేస్తోందని తెలిపారు.
అసెంబ్లీలోని 403 స్థానాలకు గాను తొలి విడత చర్చల్లో కాంగ్రెస్‌కు 26 సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ తొలుత 181 సీట్లు డిమాండ్ చేయగా ఆ తర్వాత 120 సీట్లు కావాలని కోరినట్లు సమాచారం. మరీ తక్కువ సీట్లకు ఒప్పుకునేందుకు హస్తం పార్టీ సిద్ధంగా లేకపోవడంతో చర్చలు కొలిక్కి రాలేదు. ఎన్నికల నాటికి విభేదాలను పరిష్కరించుకునేందుకు ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
రాబోయే యూపీ ఎన్నికలను నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంతో ముడిపెడుతూ అఖిలేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడం వల్ల ఏ పార్టీలు ఎవరితో కలిసి ఉన్నాయో, ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారో స్పష్టమవుతుందని అన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఇతర ఎన్నికల సంబంధిత అంశాలతో ప్రతిపక్షాలను బిజీగా ఉంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈసీ విశ్వసనీయత కోల్పోయిందని, దాని ఉద్దేశాలు స్పష్టంగా లేకపోవడం వల్ల అధికారులు చేయాల్సిన క్షేత్రస్థాయి పనిని కూడా తామే చేయాల్సి వస్తోందని విమర్శించారు.
Also Read: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల తేదీలు వచ్చేశాయ్!