Rajasthan Elections: రాజస్థాన్‌లోని ఓ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. గెలుపు కోసం ఓ మహిళా అభ్యర్థి ఏకంగా మూడు రకాలుగా నామినేషన్లు దాఖలు చేయడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఒకేసారి రెండు ప్రధాన పార్టీల (కాంగ్రెస్, బీజేపీ) తరఫున.. అలాగే స్వతంత్ర అభ్యర్థిగానూ ఆమె నామినేషన్లు వేయడం అధికారులతో పాటు ఓటర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
వతి కుమారి అనే మహిళ తొలుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వాజిబ్ అలీ సమక్షంలో ఎరుపు రంగు చీరలో వచ్చిన ఆమె, నామినేషన్ పత్రాలపై సంతకం చేసే సమయంలో తన ముఖాన్ని కొంగుతో కప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన కొద్ది నిమిషాలకే వతి కుమారి వేషధారణను పూర్తిగా మార్చేశారు. ఆకుపచ్చ రంగు సల్వార్ సూట్ ధరించి దుపట్టాతో ముఖాన్ని కప్పుకుని మరోసారి నామినేషన్ కేంద్రానికి వచ్చారు. ఈసారి బీజేపీ ఎమ్మెల్యే జవహర్ సింగ్ బేధమ్ సమక్షంలో బీజేపీ అభ్యర్థిగా రెండో నామినేషన్ దాఖలు చేశారు.
అంతటితో ఆగని ఆమె, మూడోసారి పసుపు రంగు చీరలో వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఈసారి మాత్రం ఆమె తన ముఖానికి ఎలాంటి ముసుగు వేసుకోకుండా నేరుగా అధికారుల ముందు హాజరయ్యారు. ఏ ఒక్క పార్టీ టికెట్‌పైనా పూర్తి నమ్మకం లేకపోవడంతోనే ఆమె ఇలా మూడు నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది.
అయితే ఎన్నికల ఫలితాల్లో వతి కుమారి అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. గతంలో బ్రజ్‌నగర్ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేసిన ఆమె మామ అర్జున్ ప్రధాన్.. ఈ ఎన్నికల వ్యవహారాలను దగ్గరుండి నడిపించినట్లు తెలుస్తోంది. ఫలితాల అనంతరం బీజేపీ కూడా ఆమెకు మద్దతు ప్రకటించడంతో అధికారులు ఆమెకు గెలుపు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.
Also Read: మగ పోలీసు పెళ్లిని అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్.. ఆఖరి నిమిషంలో రచ్చ రచ్చ.. కారణం ఏంటంటే?
ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఒక అభ్యర్థి ఒకే వార్డు లేదా నియోజకవర్గం నుంచి గరిష్టంగా నాలుగు నామినేషన్ పత్రాలను దాఖలు చేసే వెసులుబాటు ఉంది. అయితే వారు ఏదైనా ఒక రాజకీయ పార్టీకి మాత్రమే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయవచ్చు. కానీ ఇక్కడ మూడు వేర్వేరు హోదాల్లో వతి కుమారి నామినేషన్లు వేయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: కార్తీక దీపం వివాదం.. మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. సహించబోమంటూ ఘాటు వ్యాఖ్యలు!