Calcutta High Court: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరో కీలక మలుపు తీసుకున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా టీఎంసీ చీలిక వర్గం నేత రితబ్రత బెనర్జీని గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. జస్టిస్ కృష్ణారావుతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. దీంతో టీఎంసీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ సీఎం మమతా బెనర్జీకి ఊరట లభించినట్లైంది.
రితబ్రత బెనర్జీ నియామకంతో పాటు ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్‌ను చీఫ్ విప్‌గా నియమిస్తూ స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో మమతా బెనర్జీ వర్గం వాదనాలు కూడా తిరిగి పరిశీలించాలని హైకోర్టు సూచించింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరనే దానిపై పది రోజుల్లోగా తాజాగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించింది.
ఈ ఏడాది జరిగిన బెంగాల్ అంసెబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఘోర ఓటమి చవిచూశారు. అనంతరం ఆ పార్టీలో తీవ్ర అంతర్గత విభేదాలు తలెత్తాయి. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోగా రితబ్రత బెనర్జీ నేతృత్వంలో ఒక వర్గం ఏర్పడింది. అయితే మమతా బెనర్జీ వర్గం సీనియర్ ఎమ్మెల్యే శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా నామినేట్ చేసింది. కానీ స్పీకర్ మాత్రం రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తించి, అఖ్రుజ్జమాన్‌ను చీఫ్ విప్‌గా నియమించారు. స్పీకర్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఛటోపాధ్యాయ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు తీర్పు వెలువడిన రోజే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) వద్ద తృణమూల్ కాంగ్రెస్ రెండు వర్గాల వివాదంపై విచారణ ప్రారంభమైంది. మమతా బెనర్జీ వర్గం తరఫున అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీ, డెరెక్ ఓబ్రెయిన్ హాజరుకాగా.. ప్రత్యర్థి వర్గం తరఫున రితబ్రత బెనర్జీ, అఖ్రుజ్జమాన్ వాదనలు వినిపించారు. ఒకవైపు స్పీకర్‌కు కోర్టు ఇచ్చిన 10 రోజుల గడువు.. మరోవైపు పార్టీ నియంత్రణ, ఎన్నికల గుర్తు హక్కు కోసం ఈసీ వద్ద జరుగుతున్న పోరుతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
Also Read: చలికాలంలో మంచి ఆదాయం కావాలా? రూ. 1 లక్ష లోపు పెట్టుబడితో.. 5 లాభదాయక వ్యాపారాలు!