Rahul Gandhi: అలహాబాద్ హైకోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. 2025లో ఆయన చేసినట్లుగా చెబుతున్న ఇండియన్ స్టేట్ వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయాలని దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ డి. చౌహాన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ మేరకు తీర్పునిస్తూ, రాహుల్ వ్యాఖ్యల్లో దేశ వ్యతిరేకత ఏమీ లేదని స్పష్టం చేసింది.
ఈ వివాదం 2025లో ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) కొత్త కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మొదలైంది. ఆ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “మనం ఇప్పుడు కేవలం బీజేపీ లేదా ఆరెస్సెస్‌తో మాత్రమే కాదు.. మొత్తం ‘ఇండియన్ స్టేట్’ (భారత ప్రభుత్వ వ్యవస్థ)తో పోరాడుతున్నాం.” అని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ ఒకే భావజాలం కిందకు వెళ్లాయని విమర్శించే క్రమంలో ఆయన ఈ మాటలు వాడారు.
హిందూ శక్తి దళ్‌కు చెందిన సిమ్రాన్ గుప్తా అనే వ్యక్తి ఈ వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ నేరుగా “భారత రాజ్యం” (Indian State) తోనే పోరాడుతున్నామని అనడం దేశాన్ని అస్థిరపరిచేలా ఉందని, ఇది దేశద్రోహం కిందకు వస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. అంతకుముందు సంభల్ జిల్లా కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించడంతో, పిటిషనర్ అలహాబాద్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సందర్భంలో చేసినవి మాత్రమేనని, అవి దేశానికి వ్యతిరేకమైనవి కావని కోర్టు అభిప్రాయపడింది. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ విధానాలను లేదా వ్యవస్థల పనితీరును విమర్శించే హక్కు ఆయనకు ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ వ్యాఖ్యల వల్ల దేశ సార్వభౌమాధికారానికి ఎలాంటి ముప్పు లేదని, అందువల్ల ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.
Read Also: హైడ్రాను అవతల పారేస్తానంటున్న కేసీఆర్..! జిల్లాలకూ విస్తరిస్తామంటున్న మహేశ్!