POCSO Case: స్వేచ్ఛ బ్యూరో: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మృగంగా మారి మైనర్ కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడైన తండ్రికి మొత్తం 62 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్ శుక్రవారం సంచలన తీర్పు ప్రకటించారు. అదనంగా రూ.35 వేల జరిమానా విధించారు. బాధితురాలికి జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా రూ.3 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.
కూతిరిపై లైంగిక దాడి
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రెడ్డి వివరాల ప్రకారం… బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి జీవనోపాధి కోసం కుటుంబంతో నగరానికి వలస వచ్చి, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దంపతులు కూలీ పనులు చేస్తుండగా, కూతుళ్లు చదువుకుంటున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో రంజాన్ సందర్భంగా తల్లి పనికి వెళ్లిన సమయంలో, చిన్న కూతురిని బయటికి పంపి పెద్ద కూతురిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అనంతరం ఇంటి పైకప్పు పైకి తీసుకెళ్లి విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
బాదితుడిపై కేసు నమోదు
ఇంటికి వచ్చిన తల్లికి చిన్న కూతురు విషయం తెలియజేయగా, పెద్ద కూతురు ఇదే మొదటి సారి కాదని, గతంలో కూడా పలుమార్లు దాడి జరిగినట్లు వెల్లడించింది. దీనితో బాధిత తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ గడ్డం మల్లేశ్ కేసు నమోదు చేసి, వేగంగా విచారణ పూర్తి చేసి పాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం నిందితుడిపై అభియోగాలు రుజువవడంతో కోర్టు శిక్ష విధించింది.
62 ఏళ్ల జైలు శిక్ష
అత్యాచారానికి 20 ఏళ్లు, మైనర్‌పై లైంగిక దాడికి 20 ఏళ్లు, అఘాయిత్యానికి 20 ఏళ్లు, బెదిరింపులకు 2 ఏళ్లు జైలు శిక్షలు విధించింది. మొత్తం 62 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.35 వేల జరిమానా విధించింది. ఈ కేసులో సీఐ గడ్డం మల్లేశ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వేగంగా విచారణ పూర్తి చేయగా, కోర్టు డ్యూటీ ఆఫీసర్ శ్రీనివాస్, లైజన్ ఆఫీసర్ మానిక, భరోసా లీగల్ అసిస్టెంట్ కల్యాణి బాధితురాలికి అండగా నిలిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రెడ్డి బలంగా వాదనలు వినిపించి, ఏడాది లోపే నిందితుడికి శిక్ష పడేలా చేశారు.
Also Read: కేరళలో ఏనుగు బీభత్సం.. కారు , బైక్లను తొక్కిపడేసి..