BigTV English

Babri Masjid Demolition : దేశం తలదించుకున్న రోజు.. డిసెంబరు 6..!

Babri Masjid Demolition : దేశం తలదించుకున్న రోజు.. డిసెంబరు 6..!

Babri masjid Demolition : నేటి సోషల్‌ మీడియా తరానికి డిసెంబరు 6 అంటే.. అంబేద్కర్ వర్థంతి గుర్తుకు వస్తుంది. కానీ.. 1992లో సరిగ్గా ఇదే రోజు ఒక విషాదఘట్టానికి వేదికగా నిలిచిందనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. ఆ రోజు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శిలాన్యాస్ (పునాది రాయి వేయటం) కార్యక్రమం కోసం దేశం నలుమూలల నుంచి లక్షన్నరమందికి పైగా కరసేవకులు తరలివచ్చారు. రెండు మూడు రోజుల ముందు నుంచే వారు అయోధ్యకు చేరుకుని ముందే నిర్దేశించిన ప్రదేశాల్లో బసచేసి ఉన్నారు.


దీంతో డిసెంబర్‌ 6న ఏదో జరగబోతుందనే వార్తలు దేశమంతా వ్యాపించాయి. అక్కడి బాబ్రీ మసీదుకు ధ్వంసం చేసే ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అప్పటికే నాటి పీవీ నరసింహరావు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉంది గనుక అయోధ్యలో కరసేవకుల ర్యాలీని అడ్డుకోవాలని, యు.పి.లో రాష్ట్రపతి పాలన విధించి ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని కేంద్రాన్ని బీజేపీయేతర పక్షాలు కోరాయి. కానీ, ప్రధాని పి.వి.నరసింహారావు మౌనం వహించారు.

అదే సమయంలో.. మసీదుకు ఎలాంటి నష్టం కలిగించబోమని నాటి యూపీ బీజేపీ సీఎం కల్యాణ్ సింగ్, బీజేపీ అగ్రనేతలు, హిందూత్వ సంస్థలు సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చాయి. ఇందుకు విరుద్ధంగా ఆ రోజున ర్యాలీలో ప్రసంగించిన నేతలు ఉద్వేగపూరిత ఉపన్యాసాలతో కరసేవకుల్ని రెచ్చగొట్టారు. కరసేవకులు మసీదులోకి చొచ్చుకుపోతున్నా.. భద్రతాబలగాలకు చర్య తీసుకునేందుకు ఆదేశాలు అందలేదు. దీంతో ప్రపంచమంతా చూస్తుండగానే.. గంటల వ్యవధిలోనే 16వ శతాబ్దం నాటి ఆ ప్రాచీన కట్టడపు మూడు గుమ్మాలు కరసేవకుల చేతుల్లో నేలమట్టమయ్యాయి. కరసేవకుల్లో రేగిన ఆగ్రహావేశాల కారణంగానే బాబ్రీ మసీదు కూలిపోయిందని ఆ తర్వాత బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు.


తమ నిర్దిష్ట రాజకీయ ప్రయోజనం కోసం, దేశంలో తీవ్రమైన జాతీయవాదాన్ని మరో ఆలోచన లేకుండా.. హిమాలయాల స్థాయికి తీసుకుపోవటానికి ఈ ఘటన తర్వాతి రోజుల్లో బాటలు పరిచింది. ఈ బాబ్రీ మసీదు కూల్చివేతలో బీజేపీ అగ్రనేతల కుట్ర ఏమీ లేదని సీబీఐ స్పెషల్‌ కోర్టు 2020 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది. ”ఈ కూల్చివేత ముందే అనుకుని చేసినది కాదు” అని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిందితులైన ఎల్‌.కె.అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి, వినయ్‌ కటియార్‌తో పాటు మొత్తం 32 మందిని నేర విముక్తుల్ని చేసింది.

కానీ.. బాబ్రీమసీదు విధ్వంసం అనంతరం దేశవ్యాప్తంగా మతకల్లోలాలు చెలరేగాయి. దాదాపు 2000 మంది చనిపోయారు. అంతర్జాతీయంగా భారత గణతంత్ర వ్యవస్థ అప్రతిష్ట పాలైంది. భిన్నత్వంలో ఏకత్వం, లౌకిక విధానం అనే పునాదులే పెకలించబడ్డాయి. బీజేపీ అతివాద రాజకీయాల ప్రభావం వల్ల అప్పటివరకు తటస్థులుగా ఉన్నవారు హిందూత్వకు అనుకూలురుగా మారటం మొదలవటంతో దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చివేసింది. విభజన రాజకీయాలు, విద్వేష రాజకీయాలు, మూకహత్యలు మన సామాజిక, రాజకీయ రంగంలో అంతర్భాగమయ్యాయి. ‘లౌకికవాదం’ అనే మాట వినకూడని మాటలా మారింది. విద్యా, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోనూ అతివాద జాతీయ వాద ధోరణులు విస్తరిస్తూ వచ్చాయి.

మతం – ప్రపంచీకరణ చేతిలో చేయివేసుకుని సాగే సరికొత్త వాతావరణం సమాజాన్ని ఒక తెలియని మత్తులో, భ్రమల్లో ముంచెత్తుతున్న వేళ, మానవీయ విలువల కంటే జాతీయవాదమే గొప్పదనే ఒక వర్తమానం మనుషుల్ని మాయ జేస్తున్న వేళ.. మన దేశపు గణతంత్ర వ్యవస్థ, లౌకిక వ్యవస్థ పునాదులను కదిలించిన నాటి విధ్వంస ఘటనకు 31 ఏళ్లు నిండాయనే ఎరుక ఉందో లేదో మరి..!

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×