LPG Cylinder Price: దసరా పండుగ వేళ జీఎస్టీ పన్నుల సవరణతో సామాన్యుడికి శుభవార్త చెప్పింది కేంద్రం. వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాకిచ్చాయి. అక్టోబర్ ఒకటి నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచాయి. దీని ప్రభావం హోటల్లు, రెస్టారెంట్లు, మిగతా వ్యాపారాలపై పడనుంది.
గ్యాస్ సిలిండర్ ధరలకు రెక్కలు
దసరా పండగ వేళ సామాన్యులకు షాక్ ఇచ్చాయి ఆయిల్ కంపెనీలు. అక్టోబర్ ఒకటి నుంచి ధరల పెంచాయి. ధరల పెంపు కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు మాత్రమే. గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి.
హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, చెన్నై వంటి నగరాల్లో ధర సగటున 15 నుంచి 16 రూపాయల వరకు పెరిగింది. వాణిజ్య వర్గాలైన హోటల్, రెస్టారెంట్లకు అదనపు భారంగా మారింది. గృహ వినియోగదారు లకు ఇచ్చే గ్యాస్ సిలిండర్ హైదరాబాద్‌లో ధర 905 రూపాయలు, అదే బెంగళూరులో 855.50 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 853 రూపాయలు, ముంబైలో 852.50 రూపాయలు మాత్రమే. ఇక లక్నోలో 890.50 రూపాయాలుగా ఉంది.
వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే..
కమర్షియల్ సిలిండర్ విషయానికొస్తే ఢిల్లీలో 19 కిలోల ఇకపై 1595.50 రూపాయలు. అంతకుముందు 1580 రూపాయలుగా ఉండేది. కోల్‌కతాలో గతంలో 1684 రూపాయలు ఉండగా, 1700.50 రూపాయలకు చేరింది. ముంబై గతంలో 1531.50 రూపాయలు కాగా, పెంచిన ధరతో 1547 రూపాయలు అయ్యింది. చెన్నైలో 1738 రూపాయలు ఉండగా, పెంచిన ధరతో 1754.50 రూపాయలు అయ్యింది.
ALSO READ: నాపై ప్రతీకారం తీర్చుకోండి.. హీరో విజయ్ స్పందన
క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ తగ్గుదల రాబోయే రోజుల్లో LPG ధరలు స్థిరపడటానికి పనికి వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో పలుమార్లు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. ఆ లెక్కన పరిశీలిస్తే 15 నుంచి 16 రూపాయల పెంపు పెద్దగా ప్రభావం పడదని అంటున్నాయి.
మరోవైపు దసరా సందర్భంగా ప్రధాని ఉజ్వల యోజన పథకం కింద 25 లక్షల గ్యాస్ కనెక్షన్లు కొత్తగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగానే ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి. కొత్తగా ఇవ్వనున్న 25 లక్షల కనెక్షన్లతో ఆ సంఖ్య 10.60 కోట్లకు చేరనుంది. ఒక్కో కనెక్షన్‌పై ప్రభుత్వం 2050 రూపాయలు ఖర్చు చేస్తోంది. పేద కుటుంబాలకు ఇదొక శుభవార్తగా చెప్పువచ్చు.