BJP: బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తాను కోరుకున్న సీటును కేటాయించకపోవడంపై రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను చాలా సార్లు టికెట్ గురించి అభ్యర్థించానని.. అయినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. త్వరలో జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోబోతున్నట్లు తెలిసింది. కర్ణాటకలో ఎన్నికల వేళ ఈ పరిణామం ఆ పార్టీకి గట్టి దెబ్బే.
బీజేపీ సీనియర్ నేతలు తనను తీవ్రంగా అవమానించారని శెట్టర్ చెప్పారు. టిక్కెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మైని కలిసిన తర్వాత ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. జగదీశ్ శెట్టర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కర్ణాటకకు ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు.
ఇటీవలే జగదీష్ షెట్టర్.. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఢిల్లీలో కలిశారు. తనకు సీటు కేటాయించకపోతే.. తీవ్ర నిర్ణయం ఉంటుందని.. తేల్చిచెప్పారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే.. కనీసం పాతిక సీట్లపై ప్రభావం ఉంటుందని.. తేల్చిచెప్పారు. కానీ అధిష్టానం దగ్గర ఆయన చేసిన బెదిరింపులు ఏం పనిచేయలేదని తేలిపోయింది. ఇటు శెట్టర్ రాజీనామాపై బీజేపీ ఉన్నతస్థాయి వర్గాలు తీవ్రంగా స్పందించాయి. షెట్టార్.. పార్టీ కన్నా తనకు తాను పెద్ద పీట వేసుకున్నారని చెప్పాయి. తాను పార్టీ కన్నా గొప్పవాడిననే భావంతో ఆయన వ్యవహరించారని ఆరోపించాయి.