Businessman Family Suicide: కారణాలు ఏంటో తెలీదు. కానీ ఓ వ్యాపారవేత్త.. తన భార్య, ఇద్దరు పిల్లలను చంపేశాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు ముందు ఆయన రాసిన లేఖలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఘటనకు ముందు ఏం జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
మైసూర్‌లో వ్యాపారవేత్త ఫ్యామిలీ ఆత్మహత్య-కర్ణాటకలోని మైసూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 49 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి హరీష్, తన భార్య నిషిత, ఇద్దరు కుమార్తెలను చంపేశాడు. ఆ తర్వాత ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఈ ఘటన జరిగింది. హుణసూరు పట్టణం న్యూ మారుతి లేఅవుట్లో ఈ ఘటన బయటపడింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌లో లభించింది. అందులో ఆస్తి, అప్పులకు సంబంధించిన విషయాలు ఉన్నాయి.
భార్య-ఇద్దరు పిల్లలను చంపి, లాకర్‌లో భద్రపరిచిన ఆస్తి పత్రాల వివరాలు, తాళాలున్న ప్రదేశం, ఆ పత్రాలను ఒక నిర్దేశిత వ్యక్తికి అప్పగించాలనే అభ్యర్థన కూడా అందులో ఉంది. ఘటన జరిగిన ప్రాంతాల్లో లభించిన ఆనవాళ్ల మేరకు.. తొలుత భార్య-ఇద్దరు పిల్లల నోటికి ప్లాస్టర్ అంటించి గొంతు నులిమి హత్య చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు మూడు రోజుల ముందు తన తల్లిని తన అమ్మమ్మ ఊరికి పంపించాడు హరీశ్.
హరీష్ సూసైడ్ ఎలా వెలుగులోకి వచ్చింది? మంగళవారం ఉదయం ఎవరూ తలుపు తీయకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి హరీష్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూశారు. ఇంట్లో నలుగురి మృతదేహాలు కనిపించాయి. ఏ విధంగా చంపేశారు అనేదానిపై పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా తెలుస్తుందని చెబుతున్నారు పోలీసులు. హరీష్ తల్లి మాత్రం మాకు అప్పుల గురించి తెలియజేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనకు ఆర్థిక సమస్యలు కారణమా? మరేదైనా కారణమా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు మైసూర్ ఎస్పీ తెలిపారు.
ALSO READ: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!
దర్యాప్తులో తేలిన అంశాలేంటి? హరీష్ వ్యాపారాలు నడపడంతోపాటు, రియల్ ఎస్టేట్ రంగంలో ఆస్తులు కలిగి ఉన్నాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఆయనకు చెందిన రెండు ఆస్తులను ఇటీవల బ్యాంకులు జప్తు చేశాయని గుర్తించారు. మృతుడు బాగా ధనవంతుడని, ఆస్తులున్నప్పటికీ ఎందుకు ఈ విధంగా చేశాడనే దానిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు అధికారులు.