teaching positions vacant : భారత్ లోని కేంద్రీయ యూనివర్శిటీల్లో ఖాళీలు భారీగా పెరుకుపోతున్నాయి. నిధుల లేమి, ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలలో జాప్యమో తెలియదు కానీ.. దేశీయ యూనివర్శిటీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల ఖాళీలు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ రాతపూర్వక సమాధానాన్ని అందించారు. దాంతో.. సెంట్రల్ యూనివర్శిటీల్లో ఖాళీ పోస్టుల విషయం వెలుగులోకి వచ్చింది.
ఓ ఎంపీ అడిగిన ఖాళీల వివరాలపై స్పందించిన విద్యాశాఖ మంత్రి 2024 అక్టోబర్ నాటికి సెంట్రల్ యూనివర్శిటీలలో 5,182 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ స్థాయిలో ఖాళీలు ఏర్పడడం వల్ల విద్యా సంస్థలు, విద్యార్థుల భవిష్యత్త్ పై ప్రభావం పడుతుందని.. ఆయా ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు.. ప్రభుత్వం చర్యలు తీసుకుందా? అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన మంత్రి.. యూనివర్శిటీల్లో ఖాళీలు ఏర్పడడం, వాటిని వేరే వాళ్లతో భర్తీ చేస్తుండడం నిరంతర ప్రక్రియ అని వెల్లడించిన మంత్రి.. ప్రస్తుత ఖాళీలకు అనేక కారణాలున్నాయని తెలిపారు. సీనియర్ ప్రొఫెసర్ల పదవీ విరమణ, రాజీనామాలతో పాటు యూనివర్శిటీల్లో పెరిగిపోతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పెరిగిన అవసరాలు సైతం ఖాళీల సంఖ్య పెరుగుదలకు కారణమన్నారు.
ఈ పోస్టులను భర్తీ చేసే బాధ్యత కేంద్రీయ విశ్వవిద్యాలయాల (CU) లపై ఉంటుంది మంత్రి స్పష్టం చేశారు. విద్యా మంత్రిత్వ శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియల ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఆదేశించినట్లు తెలిపారు.
ఇంతకు ముందు ఉన్న ఖాళీలను ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించి భర్తి చేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. ప్రత్యేక చర్చల ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని 7,650కి పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు వెల్లడించారు. అలాగే.. అక్టోబర్ 29, 2024 నాటికి.. సెంట్రల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో (CHEIs) 15,139 ఫ్యాకల్టీ పోస్టులు సహా.. మొత్తం 25,777 పోస్టులు అత్యవసర ప్రాతిపదికన భర్తి చేసినట్లు వివరించారు. వీటిలో.. 25,257 ఖాళీలను CUలు, IITలు, IIITలు, NITలు, IIMలు, IISc బెంగళూరు, IISERలు కలిపి భర్తీ చేశాయని తెలిపారు. కాగా.. ఇందులో 15,047 అధ్యాపక స్థానాలు ఉన్నాయి. కేంద్రీయ యూనివర్శిటీల్లో నియామకాలను క్రమబద్ధీకరించడానికి, UGC మే 2, 2023న ఏకీకృత రిక్రూట్‌మెంట్ పోర్టల్ CU-Chayan ని ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫారమ్ అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలోని వివిధ విభాగాల్లోని ఖాళీలు, ప్రకటనలు, ఉద్యోగ వివరాలను అందించేందుకు ఉమ్మడి వేదికగా పనిచేస్తుంది.
Also Read : టోల్ ట్యాక్స్ వసూళ్లు అన్ని లక్షల కోట్లా?
CU-Chayan అనేది సెంట్రల్ యూనివర్శిటీలలో ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ కోసం రూపొందించిన పోర్టల్. దేశంలోని అన్ని యూనివర్శిటీలకు ఇది ఉమ్మడి వేదికగా పనిచేస్తుంది. అన్ని సేవలు, వివరాల్ని ఒక్కచోటకి చేర్చే ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారులు, విశ్వవిద్యాలయాలు రెండింటి మధ్య సహకారం సులభవం అవుతుందని కేంద్రం చెబుతోంది.