Highway Toll Plaza : భారత్ లో విస్తారమైన జాతీయ రహదారుల వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ల నుంచి వినియోగదారుల రుసుము రూపంలో ప్రభుత్వానికి రూ.1.44 లక్షల కోట్లు వసూలైంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటుకు తెలిపారు. ఓ సభ్యుడి ప్రశ్నకు రాతపూర్వక సమాధానం అందించిన నితిన్ గడ్కరీ.. దేశంలోని అన్ని టోల్ ప్లాజాల నుంచి 2000 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ మొత్తం ప్రభుత్వానికి సమకూరినట్లు తెలిపారు.
కాగా.. దేశంలోని జాతీయ రహదారులను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మిస్తున్నారు. వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ అధునాతన రోడ్లపై ప్రయాణించే ప్రయాణికుల నుంచి వినియోగ రుసుము రూపంలో టోల్ గేట్లను ఏర్పాటు చేసి వసూలు చేస్తున్నారు. వేగవంతమైన ప్రయాణానికి అనువుగా ఉండడం, సుదూర ప్రాంతాలకు దగ్గరి దారులు కావడంతో వినియోగదారులు ఈ రోడ్లపై ప్రయాణానికి మెగ్గు చూపుతుంటారు. అలా.. రెండు టోల్ గేట్ల మధ్య దూరానికి… వాహన విభాగాన్ని బట్టి రుసుములు నిర్ణయించి, వసూలు చేస్తున్నారు.
వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఫాస్ట్‌ట్యాగ్‌తో పాటు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు పార్లమెంట్లో మరో సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. ప్రస్తుతం జాతీయ రహదారులపై గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జిఎన్‌ఎస్‌ఎస్) ఆధారిత టోలింగ్ వ్యవస్థ ఎక్కడా అమలులో లేదని మంత్రి తెలిపారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించారు. టోల్ గేట్ల తొలగింపు అంశాన్ని గడ్కరీ ప్రస్తావించారు. అందుబాటులోకి అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని.. రానున్న రోజుల్లో టోల్ గేట్ల దగ్గర ఆగాల్సిన అవసరం లేకుండా జీపీఎస్ ఆధారిత టోల్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంలో వాహనం జాతీయ రహదారిపైకి వచ్చిన తర్వాత నుంచి రహదారి దిగిపోయే వరకు జీపీఎస్ ఆధారంగా వాహనం ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ రుసుము వసూలు చేస్తారు.
భారత్ లో మొత్తం 599 జాతీయ రహదారులున్నాయి. వీటి మొత్తం పొడవు 1 లక్షా 32 వేల 500 కిలోమీటర్లు విస్తరించి.. అనేక నగరాలు, ప్రాంతాలను అనుసంధానిస్తున్నాయి. వీటి ద్వారా వేగంగా, సురక్షితంగా, సులువుగా రోజు కోట్ల మంది ప్రయాణిస్తుండగా.. అదే స్థాయిలో రవాణా సాగుతోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) జాతీయ రహదారులను నిర్మించి, నిర్వహిస్తాయి.
Also Read : పగలు ప్రభుత్వ ఉద్యోగం.. రాత్రి జొమాటో డెలివరీ బాయ్.. ఇదీ టీచర్ల దుస్థితి
బారత్ లోని అన్ని రాష్ట్రాల్లో జాతీయ రహదారులు ఉండగా.. వాటిలో అత్యధికంగా తమిళనాడులో ఎక్కువ సంఖ్యలో టోల్ గేట్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది. భారత్ లో వసూలు అవుతున్న టోల్ రుసుముల విషయానికి వస్తే.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా మొదటి ఎనిమిది నెలల్లో సగటున రోజుకు రూ.150 కోట్ల టోల్ వసూలైంది. ఏటికేటా జాతీయ రహదారుల విస్తీర్ణం పెరుగుతుండడంతో టోల్ రుసుముల వసూలు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగానే.. 2022-23లో సగటున రోజుకు రూ.131.5 కోట్లు వసూలు కాగా.. అంతకు క్రితం ఏడాది 2021-22లో రూ.93 కోట్లు వసూలైనట్లు ప్రభుత్వం గణాంకాలు వెల్లడిస్తున్నాయి.