
Central Cabinet : కేంద్ర కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నెల 12న కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. 22 మందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని సమాచారం. అయితే ఏపీ, తెలంగాణ నుంచి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే ఉత్కంఠ ఇరురాష్ట్రాల్లోని బీజేపీ శ్రేణుల్లో నెలకొంది.
ఈ నెల 13న ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్నారు. మోదీ విదేశీ పర్యటనకు ముందే కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కేబినెట్ నుంచి తొలగించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఆయన స్థానంలో తెలంగాణ నుంచి బండి సంజయ్, సోయం బాపూరావు, లక్ష్మణ్ లో.. ఒకరికి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన బండి సంజయ్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆయనను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. అయితే మంత్రివర్గ కూర్పులో బండి సంజయ్ కు ఛాన్స్ దక్కుతుందో, లేదో అనే ఉత్కంఠ ప్రస్తుతం ఆయన అభిమానులు, కార్యకర్తల్లో నెలకొంది.
మరోవైపు ఏపీ నుంచి సీఎం రమేష్ కు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ కేంద్ర కేబినెట్ లో ఏపీకి స్థానం కల్పించకపోవడంతో… తాజా మంత్రివర్గ విస్తరణలో ఏపీ బీజేపీ నేతలకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.