వేసవి సెలవలు వస్తున్నాయంటే స్కూల్ పిల్లలకు ఎంతో సరదా. అదే సమయంలో తల్లిదండ్రులకు కొత్త టెన్షన్ మొదలవుతుంది. సెలవలు అయిపోయాక పిల్లలు నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అవుతారు. అంటే ఫీజు విషయంలో కూడా ఆ మేరకు పెంపు ఉంటుంది. ఆ ఫీజు పెంపు అనేది నామమాత్రంగా ఉంటే పర్లేదు. తాము ఊహించిన దానికంటే మరీ ఎక్కువగా ఉంటేనే తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరుగుతుంది. ఉన్న స్కూల్ ని మాన్పించలేరు, పెంచిన ఫీజు కట్టి ఇబ్బంది పడలేరు. ఇక్కడే పేరెంట్స్ ఎమోషన్ తో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు బిజినెస్ చేస్తుంటాయి. పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేస్తుంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఫీ’జులుం’ మరీ దారుణం.
సీఎంకు ఫిర్యాదు..
దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న స్కూల్ ఫీజులకంటే దేశ రాజధాని ఢిల్లీలో ఫీజులు కాస్త ఎక్కువ. ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూల్ చదువుల విషయంలో పేదలకు కాస్త వెసులుబాటు కల్పించాలనే ప్రయత్నం జరిగినా అది పూర్తి స్థాయిలో ఫలితం సాధించలేదు. కేజ్రీవాల్ పరాజయమే దీనికి నిదర్శనం. తాజాగా బీజేపీ ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత ఈ ఫీజుల మోత మరింత మోగిపోతోందనే ప్రచారం మొదలైంది. ఇటీవల ఓ ఉదంతం సంచలనంగా మారింది. మోడల్ టౌన్ లోని క్వీన్ మేరీ స్కూల్ యాజమాన్యం ఫీజు పెంచడంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అయితే యాజమాన్యం మరింత దూకుడుగా వ్యవహరించింది. పిల్లలకు టీసీలు ఇచ్చేస్తామని బెదిరించింది. దీంతో ఈ విషయంలో తల్లిదండ్రులు కొంతమంది భయపడ్డారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఆందోళన ఉధృతం చేశారు. నేరుగా సీఎం రేఖా గుప్తాకు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వెళ్లి నేరుగా సీఎంనే కలిశారు.
आज जनसंवाद कार्यक्रम के दौरान क्वीन मैरी स्कूल, मॉडल टाउन से संबंधित एक मामला सामने आया, जिसमें बच्चों के परिजनों ने गलत तरीके से फीस वसूली और बच्चों को स्कूल से निकाले जाने की शिकायत दर्ज की।
इस विषय पर तुरंत संज्ञान लेते हुए संबंधित अधिकारियों को तत्काल जांच कर कड़ी और आवश्यक… pic.twitter.com/gVThK6jFTn
— Rekha Gupta (@gupta_rekha) April 15, 2025
సీఎం రియాక్షన్..
విద్యార్థులు, తల్లిదండ్రులు నేరుగా సీఎంని కలవడంతో ఆమె వెంటనే రంగంలోకి దిగారు. స్కూల్ ఫీజుల పెంపుని తాను ఏ మాత్రం సహించబోనంటూ ఆమె పేరెంట్స్ కి బదులిచ్చారు. అదే సమయంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. క్వీన్ మేరీ స్కూల్ గుర్తింపు రద్దు చేస్తానని హెచ్చరించారు. ఇతర ఏ స్కూల్ యాజమాన్యం అయినా అక్రమంగా ఫీజులు పెంచినా, అలా వసూలు చేసినా ఇదే గతి పడుతుందని ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఫీజులు పెంచడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయన్నారు సీఎం రేఖా గుప్తా. నిబంధనలు పాటించకుండా ఫీజులు పెంచితే తర్వాత యాజమాన్యాలు బాధపడాల్సి ఉంటుందని చెప్పారు.
ఆప్ వర్సెస్ బీజేపీ..
పిల్లల హక్కులను కాపాడటానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు సీఎం రేఖా గుప్తా. ఫీజుల దోపిడీని సహించేది లేదన్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇదంతా బీజేపీ డ్రామా అని ఆరోపిస్తోంది. ఢిల్లీలో అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ సంఘం అధ్యక్షుడు భరత్ అరోరాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని, ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ తరపున పాల్గొన్నారని ఆప్ నేతలు అంటున్నారు. అందుకే ప్రైవేటు స్కూళ్లు యథేచ్ఛగా ఫీజులు పెంచేశాయని ఆప్ విమర్శిస్తోంది. ఈ రాజకీయ విమర్శల సంగతి పక్కనపెడితే.. ప్రస్తుతానికి తల్లిదండ్రుల తరపున సీఎం స్వయంగా స్పందించడం ఇక్కడ విశేషం.