Big Stories

kashmir: మంచు కొండల్లో పురిటినొప్పులు… కాన్పు చేశారు ఇలా..?

kashmir : అది జమ్మూకాశ్మీర్ లోని మారుమూల ప్రాంతం కెరన్. అక్కడ విపరీతంగా మంచు కురుస్తోంది. ఆ సమయంలో ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమెను కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ గర్భిణికి అప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. పరిస్థితి క్లిష్టంగా మారింది. ఆమెను అత్యవసరంగా క్రాల్పోరా ఉపజిల్లా ఆస్పత్రికి తరలించాలని పీహెచ్ సీలోని వైద్యులు సూచించారు.

- Advertisement -

కెరన్ ప్రాంతంలో వాతావరణం ప్రతికూలంగా ఉంది. మంచు భారీగా కురుస్తోంది. వాహనం ద్వారా ప్రయాణానికి అవకాశం లేదు. రోడ్డుమార్గం పూర్తిగా మంచుతో మూసుకుపోయింది. కెరన్ నుంచి ఆ గర్భిణిని ఆస్పత్రి తరలించడం విమానంలో మాత్రమే సాధ్యం. ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేశారు. కానీ ప్రతికూల వాతావరణం వల్ల అధికారులు విమానాన్ని సిద్ధం చేయలేకపోయారు. అప్పటికే భారీగా మంచు కురుస్తున్న కారణంగా కుప్వారా జిల్లాలోని మిగతా ప్రాంతాలతో కెరన్ కు సంబంధాలు తెగిపోయాయి.

- Advertisement -

ఇటువంటి పరిస్థితుల్లో పీహెచ్‌సీ వైద్య సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించారు. క్రాల్‌పోరా సబ్‌డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లోని గైనకాలజిస్ట్ డా.పర్వైజ్‌ను సంప్రదించారు. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఆయన పీహెచ్‌సీలోని డాక్టర్ అర్షద్ సోఫీ, పారా మెడికల్ సిబ్బందికి ప్రసవ ప్రక్రియపై సూచనలు చేశారు. బాలీవుడ్ చిత్రం ‘త్రీ ఇడియట్స్‌’లోని ఓ సన్నివేశం మాదిరిగా ప్రసవం చేశారు. దాదాపు ఆరు గంటల ప్రసవ వేదన అనంతరం ఆ గర్భిణి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. వారిని పరిశీలనలో ఉంచినట్లు క్రాల్పోరా బ్లాక్ వైద్యాధికారి డా.మీర్ మహ్మద్ షఫీ తెలిపారు. నేటికాలంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. అందుకు తాజా ఘటనగా బలమైన ఉదాహరణగా నిలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News