Youth Congress Protest: దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ నేతలు హల్ చల్ చేశారు. భారత్-యూఎస్ ట్రేడ్ డీల్ ను వ్యతిరేకిస్తూ.. కొంతమంది యువకులు చొక్కాలు విప్పేసి అర్ధనగ్నంగా నిరసనలు తెలిపారు. ఏఐ సందస్సు వేదిక ఉన్న హాలులోకి దూసుకొచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ, వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ, ట్రంప్ చిత్రాలు ఉన్న టీ షర్టులను పట్టుకుని ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యూత్ కాంగ్రెస్ నిరసనలతో సమ్మిట్ లో కాసేపు గందరగోళం నెలకొంది. వెంటనే స్పందించిన దిల్లీ పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాసేపు ఏఐ సదస్సుకు అంతరాయం కలిగింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికాతో చేసుకున్న కొత్త వాణిజ్య ఒప్పందంతో భారత్ న్యాయమైన ప్రయోజనాలను పొందలేదని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిరసనలకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వీరిని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కృష్ణ హరి, బీహార్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుందన్ యాదవ్, యూపీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త నరసింహ యాదవ్ ఉన్నారు.
#WATCH | Delhi: Indian Youth Congress workers staged a topless protest and chanted anti-Modi slogans at Bharat Mandapam
(Source: Indian Youth Congress) pic.twitter.com/WCZgCMwkFZ
— ANI (@ANI) February 20, 2026
కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించడానికి ముందుగానే ప్లాన్ వేసుకున్నారని పోలీసులు అన్నారు. అందుకు హై సెక్యూరిటీ వేదికలోకి ప్రవేశించడానికి క్యూఆర్ కోడ్‌లను పొందారని పోలీసు వర్గాలు తెలిపాయి. నిరసనకారులను గుర్తించడానికి ఫేస్ రికగ్నైజ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నామన్నారు. నిరసనకారులందరినీ అరెస్టు చేస్తామని తెలిపారు.
ఏఐ సదస్సు సక్సెస్ కావడంతో కాంగ్రెస్ అసూయతో ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ నిరసనలపై స్పందిస్తూ..
భారత్ తనను తాను ప్రపంచ టెక్నాలజీ సెంటర్ గా నిలబెట్టుకోవడానికి అడుగులు వేస్తున్న సమయంలో కాంగ్రెస్ దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. ఇది రాజకీయ వ్యతిరేకత కాదని, ఇది భారతదేశ ఇమేజీను దెబ్బతీసే ప్రయత్నమన్నారు.
Also Read: సాంకేతిక హబ్‌గా తీర్చడమే లక్ష్యం.. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు
అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్.. యూఎస్ కు చెందిన పారిశ్రామిక వస్తువులు, ఎండిన డిస్టిలర్ల ధాన్యాలు, ఎర్ర జొన్నలు, తాజా, ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్స్, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తొలగిచండం లేదా తగ్గించనుంది. అలాగే అమెరికా భారత వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గించనుంది.