Janasena: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి జనసేన కీలక పాత్ర పోషించింది. పార్టీ పురుడు పోసుకుని దాదాపు పదేళ్లు గడిచిన తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్య అయింది. అధికారంలో లేనప్పుడు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలతో చురుకుగా ముందుకు సాగింది. అలాంటి జనసేనకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు నాయకత్వం కరువైంది. జిల్లాలో రథసారధి లేక జనసైనికులు దిక్కులు చూడాల్సి వస్తోందంట. ఎన్నికల ముందు వరకు హడావిడి కనిపించిన ఆ పార్టీ.. ప్రస్తుతం జిల్లాలో ఉందా అనే దుస్థితికి చేరిందంట..
ఇది నెల్లూరు జిల్లా..ఎన్నికల పోరులో ప్రధాన పార్టీలకు మంచి మైలేజ్ ఇచ్చే జిల్లా. రాజకీయ ఉద్దండలకు పురుడు నిచ్చిన నేల. జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాలను ఒకే పార్టీకి కట్టబెట్టి.. అందలం ఎక్కిస్తుంటారు ఈ ఉమ్మడి జిల్లా ఓటర్లు. అలాంటి జిల్లాలో టీడీపీ క్లీన్ స్పీప్ చేయడంలో తనవంతు పాత్ర పోషించిన జనసైనికులు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నడిపించే నాయకుడు లేక ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారంట. అసలే సంస్థాగతంగా అంతంతమాత్రంగా ఉన్న ఆ పార్టీ 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక పటిష్టమవుతుందని అందరూ భావించారు.
పొత్తుల లెక్కలు కలిసిరాక జనసేన ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేకపోయింది. పోనీ కూటమి ప్రభుత్వం వచ్చాక జనసేన పటిష్టమవుతుంది అనుకుంటే.. పటిష్టత సంగతేమో కాని అసలు జిల్లాలో ఆ పార్టీ ఉందా? అనే సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొందంట. పార్టీని నడిపే రథసారధిని జిల్లాలో నియమించడంలో జనసేన పార్టీ అధిష్టానం తీవ్రజాపం చేస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడ్ని నియమించడానికి జరుగుతున్న జాప్యంలో అంతర్గత సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఎన్నికలు జరిగి రెండేళ్లు గడిచినా కూడా ఇప్పటికీ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడుని నియమించడంలో విఫలమవుతుండటం ఆ పార్టీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేస్తోందంట.
2024లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జతకట్టిన జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక భాగస్వామిగా మారిన విషయం తెలిసిందే. అప్పటినుంచి రెండేళ్లుగా జిల్లా స్థాయిలో పూర్తి పార్టీ బాధ్యతలు చూసుకునేందుకు జనసేనకు నేతలు కరువయ్యారు. ఎన్నికల ముందు వరకు హడావిడి చేసిన ఆపటి జిల్లా పార్టీ అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడుని నియమించేందుకు ఆ పార్టీ అధిష్టానం ముందుకు అడుగు వేయటం లేదు.
ఇటీవల జనసేనకు చెందిన టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్‌పై జనసేన నేతలు అనేక విమర్శలు చేసినా పార్టీ పరంగా నియత్రించే పెద్దదిక్కు కరువయ్యారు. అసలు వేములపాటి స్థాయి నేతలు ఉన్నా జిల్లాలో జనసేన ఎందుకు అధ్యక్ష్య బాధ్యతలు ఎందుకు కట్టబెట్టడం లేదో ఎవరికీ అంతుపట్టడం లేదంట. ఆ క్రమంలో ఒక్కో నియోజకవర్గంలో తాము అంటే తాము అంటూ నేతలు అరకొరగా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ పోరు కొనసాగుతోంది. పార్టీ కార్యక్రమాలు నిర్వహించే విషయంలో కూడా వారి మధ్య సమన్వయం లేకుండా పోయింది. ఎవరికి వారే ఇన్చార్జిలమని చెప్పుకుంటూ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఎన్నికలకు మరో మూడేళ్లు ఉంది.. 12 ఏళ్ల పాటు సంస్థాగతంగా పట్టు సంపాదించుకోలేకపోయినా, జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా నుంచి పోటీకి జనసేన సమాయత్తమవుతోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ దిశగా అడుగు ముందుకు పడటం లేదు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం, ప్రతి అధికారిక కార్యక్రమానికి అరకొరగా హాజరవడం తప్ప మరేం కనిపించడం లేదు. దీంతో పార్టీ క్యాడర్ నిరుత్సాహంలో ఉన్నట్లు ఆ పార్టీ నేతలే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామ స్థాయిలో కూడా పార్టీకి పట్టు తప్పే పరిస్థితి లేకపోలేదని వాపోతున్నారు.
పార్టీకి దిశా నిర్దేశం చేయడంతో పాటు జిల్లా పార్టీని నడిపించే నాయకుడ్ని నియమించడంలో ఎందుకు అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తుందో అంతుచిక్కటంలేదని లోలోన మదన పడుతున్నారు జిల్లా జనసైనికులు. ఇకనైనా పార్టీ అధినేత జోక్యం చేసుకొని నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి వైభవం కొనసాగేలా చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు. చూద్దాం ఈసారి జరిగే పంచాయతీ ఎన్నికల్లో జనసేన లోటుపాట్లు సరిదిద్దుకుంటుందో లేదో?
Story by: Apparao, Big Tv