Kashmir : అమర్‌నాథ్. హిమాలయాల్లో సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగం. హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. సముద్రమట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉండే గుహకు అతికష్టం మీద యాత్ర చేస్తారు భక్తులు. ప్రతీ ఏడాది లక్షల్లో తరలివస్తుంటారు. కొండలు, లోయలు, ఇరుకైన మార్గాల గుండా అతికష్టంగా సాగుతుంది యాత్ర. గుండెల నిండా భక్తితో, శివన్నామ స్మరణతో.. అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదులుతుంటారు. గతంలో 52 రోజుల పాటు అమర్‌నాథ్ జరిగేది. ఈసారి 38 రోజులకే కుదించారు. జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు భక్తులను అనుమతిస్తారు. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వాళ్లకే అనుమతి.
ఆ ఉగ్రవాదులతో టెన్షన్
అయితే, అమర్‌నాథ్ యాత్ర పూర్తిగా జమ్మూ కశ్మీర్ లో సాగునుండటం హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆ రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం వరకూ దారి తీసింది. ఇప్పటికీ కశ్మీర్‌లో టెర్రరిస్టుల వేట కొనసాగుతోంది. పహల్గాంలో 26 మంది హిందువులను కాల్చి చంపిన నలుగురు ఉగ్రవాదులు ఇప్పటికీ దొరకలేదు. వాళ్లు ఇంకా తప్పించుకుని తిరుగుతున్నారు. గత రెండేళ్లుగా ఆ నలుగురు కశ్మీర్‌లోనే ఉంటూ మూడు దాడులకు తెగపడ్డారు. యావత్ దేశాన్ని షేక్ చేసిన పహల్గాం అటాక్ తర్వాత కూడా వాళ్లంతా ఇప్పటికీ ప్రాణాలతో ఉండటం.. ఆర్మీకి చిక్కకుండా నక్కడం.. అమర్‌నాథ్ యాత్రకు డేంజర్ సిగ్నల్స్ మోగిస్తోంది. అందుకే, భద్రతా బలగాలు యాత్రకు మరింత టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాయి.
ఏనీ టైమ్ రెడీ..
భక్తుల భద్రతకి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్. పహల్గాం, జమ్ము, బేస్ క్యాంపులు, యాత్ర నివాస్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 581 కంపెనీల CRPF బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు. అమర్‌నాథ్ యాత్ర సమయంలో భక్తుల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా.. జాతీయ రహదారులను తాత్కాలికంగా మూసేస్తున్నామన్నారు. యాత్ర మార్గాల్లో రోడ్డు ఓపెనింగ్ పార్టీలు , క్విక్ యాక్షన్ టీమ్స్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్, కె9 డాగ్ యూనిట్లు, డ్రోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు భయపడాల్సిన పని లేదని.. ఇండియన్ ఆర్మీపై నమ్మకంతో యాత్ర కొనసాగించాలని పిలుపు ఇచ్చారు.