Delhi Bomb Blast: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. చారిత్రక ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఒక కారులో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ పెను ప్రమాదంలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. 13 మంది మరణించగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. పేలుడు ధాటికి కారుతో పాటు పక్కనే ఉన్న మరో ఆరు కార్లు, రెండు ఈ-రిక్షాలు, ఒక ఆటోరిక్షా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
ప్రధాని తొలి ప్రకటన ఇదే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ పేలుడుపై స్పందించారు. మరణించిన వారి కుటుంబాలకు తన ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘ఈ పేలుడుతో ప్రభావితమైన వారికి అధికారులు సహాయం అందిస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా ఇతర అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఈ అమానుష ఘటనపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు.
ఢిల్లీ పేలుడు వార్త విని చాలా కలత చెందానని ఏపీ మంత్రి నార లోకేష్ అన్నారు. బాధితులు, వారి కుటుంబాల గురించే నా ఆలోచనలు ఉన్నాయి. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందేలా చూడాలని అధికారులను కోరుతున్నాను. ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ప్రశాంతత, భద్రత ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను’ అంటూ నారాలోకేష్ చెప్పుకొచ్చారు.
ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు గురించి తెలిసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి, విచారానికి గురయ్యాను. ఈ సంఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ఘోర విషాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
ఢిల్లీలోని లాల్ కిలా మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన కారు పేలుడు వార్త చాలా బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఘటన ఆందోళనకరం. ఈ దురదృష్టకర ప్రమాదంలో ఎందరో నిరపరాధులు మరణించడం అత్యంత బాధాకరం. ఈ దుఃఖ సమయంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలబడి, వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరూ వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
ALSO READ: Delhi Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. హైదరాబాద్ లో పోలీసులు అలర్ట్.. రేపు జూబ్లీ పోలింగ్ ఉంటుందా..?