దేశంలో లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది. దీనికి సంబంధించి ముసాయిదా బిల్లులో స్పష్టమైన విభజన కనిపిస్తోంది. మొత్తం 850 సీట్లలో రాష్ట్రాలకు 815 కేటాయించారు. కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు దక్కనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రాలకు 530 ఉన్న సీట్లు ఏకంగా 815కి చేరుతుండటం గమనార్హం. కేంద్రపాలిత ప్రాంతాల వాటా కూడా 13 నుండి 35కి పెరగనుంది. 2026 తర్వాత జరిగే జనాభా గణన కోసం వేచి చూడకుండా 2011 డేటా ఆధారంగానే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ విస్తరణలో ‘ప్రో-రాటా’ మోడల్‌ను ప్రధానంగా అనుసరిస్తున్నారు. దీనివల్ల ప్రతి రాష్ట్రం ప్రస్తుతమున్న సీట్ల వాటా సుమారు 56 శాతం మేర పెరుగుతుంది. రాష్ట్రాల మధ్య ఉండే రాజకీయ ప్రాబల్య సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు ఈ వ్యూహం ఎంచుకున్నారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రత్యేకించి ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ఈ దామాషా పద్ధతి ఒక వారధిగా పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు.
యూపీలో పెరగనున్న 45 ఎంపీ స్థానాలు..
పెద్ద రాష్ట్రాల విషయానికి వస్తే.. సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ 80 స్థానాల నుండి 125కి చేరుకుంటుంది. బీహార్ రాష్ట్రం 40 నుండి 62 స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. మహారాష్ట్ర ప్రస్తుతమున్న 48 సీట్ల నుండి 75కి పెరుగుతుంది. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో పెరిగే ఈ సంఖ్య ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలక పాత్ర పోషించనుంది. 850 సీట్ల మోడల్‌లో 283 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేస్తారు. మిగిలిన 567 స్థానాలు జనరల్ ఇతర వర్గాలకు అందుబాటులో ఉంటాయి. మహిళా కోటా అమలు చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న సాధారణ సీట్ల సంఖ్య తగ్గకుండా ఉండటమే ఈ ప్లాన్ లోని ప్రధాన ఉద్దేశం.
తమిళనాడులో 39 నుంచి 61కి..
దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఒకవేళ 2026 జనాభా అంచనాల ప్రకారం సీట్ల విభజన జరిగితే ఈ రాష్ట్రాలు తమ ప్రాబల్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచడం వల్ల తమిళనాడు 39 నుండి 61 స్థానాలకు చేరుతుంది. కేరళ 20 నుండి 31 సీట్లు సాధిస్తుంది. అంటే ఈ రాష్ట్రాల బలం కూడా పెరుగుతుంది.
అయితే ప్రతిపక్షాలు ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. శాతాల పరంగా పెరుగుదల సమానంగా ఉన్నా సంఖ్య పరంగా ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ లాభపడతాయని విమర్శిస్తున్నాయి. ఎగ్జాంపుల్ కు.. ఉత్తరప్రదేశ్ 45 కొత్త సీట్లను పొందుతుంటే తమిళనాడు కేవలం 22 కొత్త సీట్లను మాత్రమే పొందుతుంది. ఈ తేడా వల్ల పార్లమెంటులో ఉత్తరాది ఆధిపత్యం పెరుగుతుందని డీఎంకే ఇండియా కూటమి ఆందోళన చెందుతున్నాయి. 2029 నాటికి మహిళా రిజర్వేషన్లు అమలు కావాలంటే రాజ్యాంగ పరంగా ఇదే ఏకైక మార్గమని ప్రభుత్వం బలంగా వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ మార్పులు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మారుస్తాయని భావిస్తున్నారు.
ALSO READ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానికి ప్రతిభా పాటిల్ ప్రశంసలు.. ప్రజాస్వామ్య బలోపేతానికి ఇదో ముందడుగు