Tamilnadu Assembly Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార-విపక్షాలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థుల ఆస్తుల వ్యవహారంపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్ వార్తల్లోకి వచ్చాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
తమిళనాడు ఎన్నికల బరిలో లాటరీ కింగ్ భార్య లీమా రోజ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల్లో అత్యంత ధనికులు ఎవరో తేలిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, అన్నాడీఎంకె అభ్యర్థి లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా అక్షరాలా రూ.5 వేల కోట్ల పైమాటే. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం.
తిరుచిరాపల్లి జిల్లా లాల్‌గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా లీమా రోజ్ బరిలో నిలబడ్డారు. ఆమె కుటుంబం ఆస్తుల విలువ దాదాపు రూ.5,863 కోట్లు. ఈ విషయాన్ని ఆమె తన నామినేషన్ పత్రాల్లో ప్రస్తావించారు. ఆమె తన అఫిడవిట్‌లో ప్రస్తావించిన వివరాల మేరకు.. ఆమె పేరిట రూ.139 కోట్ల చరాస్తులు, రూ.910 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆమె ఆస్తులపై తమిళనాడులో చర్చ.. రూ.5 వేల కోట్లకుపైమాటే
లీమా భర్త, ప్రముఖ వ్యాపారవేత్త మార్టిన్ పేరిట అత్యధికంగా ఆస్తులున్నాయి. భర్త పేరిట దాదాపు రూ.3,262 కోట్ల చరాస్తులు, రూ.887 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అందులో ప్రస్తావించారామె. ఈ దంపతుల కొడుకు జోస్ టైసన్ మార్టిన్ పేరిట రూ.225 కోట్ల చరాస్తులు, రూ.439 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
గతేడాది లీమా రోజ్ తన ఆదాయాన్ని రూ.9.82 కోట్లుగా చూపించాయి. అలాగే ఆమె భర్తకు రూ.11.39 కోట్లు ఆదాయం వచ్చినట్టు వెల్లడించారు. ప్రస్తుతం లీమా చేతిలో రూ.5 లక్షల నగదు ఉంది. భర్త వద్ద రూ.56 లక్షల నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక బంగారం, వెండి, వజ్రాల వివరాల విషయానికి వద్దాం.
ALSO READ: కేరళం సీఎం ఆరోపణలు.. తిప్పికొట్టిన సీఎం రేవంత్‌రెడ్డి, ఆరు పేజీల లేఖలో
లీమా రోజ్ వద్ద 19,233 గ్రాముల బంగారం, 1,31,813 గ్రాముల వెండి, 1,217 క్యారెట్ల వజ్రాలున్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. తనపై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు. లీమారోజ్ అఫిడవిట్ వివరాలు తమిళనాట రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.