Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈ సర్వేలన్నీ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని.. తమ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ అంచనాలను ప్రసారం చేయడానికి భారతీయ జనతా పార్టీ కొంతమంది మీడియా ప్రతినిధులకు భారీగా నిధులు సమకూర్చిందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ టీఎంసీ ఒంటరిగానే 226 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని దీదీ జోస్యం చెప్పారు.
ఎగ్జిట్ పోల్స్ చూసి పార్టీ శ్రేణులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని మమతా బెనర్జీ భరోసా ఇచ్చారు. మే 4న జరగబోయే ఓట్ల లెక్కింపు సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆమె కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. “భవానీపూర్‌లో నేను కాపలా ఉంటాను.. మిగతా ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును మీరు పర్యవేక్షించండి.” అని ఆమె పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు అమిత్ షా ఆదేశాల మేరకు బీజేపీ ఏజెంట్లుగా పనిచేశాయని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు తమ వైపే ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు ప్రముఖ సర్వే సంస్థ ‘యాక్సిస్ మై ఇండియా’ (Axis My India) బెంగాల్ ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను ప్రకటించకూడదని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న భయానక వాతావరణం కారణంగా ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి సిద్ధంగా లేరని ఆ సంస్థ చీఫ్ ప్రదీప్ గుప్త తెలిపారు. సర్వే కోసం తాము కలిసిన వారిలో సుమారు 70 నుంచి 80 శాతం మంది మాట్లాడటానికి నిరాకరించారని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అసంపూర్తి డేటాతో ఫలితాలను వెల్లడించడం కంటే అంచనాలను ప్రకటించకపోవడమే మంచిదని తాము భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు.. దాడుల వల్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ప్రదీప్ గుప్త పేర్కొన్నారు. కెమెరాలు.. మీడియా ప్రతినిధులను చూడగానే ప్రజలు భయపడుతున్నారని.. వారు తమ మనసులోని మాటను చెప్పడానికి వెనుకాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బెంగాల్ ఎన్నికలపై వెలువడిన ఇతర ఆరు ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో నాలుగు సంస్థలు బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పగా.. రెండు సంస్థలు మాత్రం మమతా బెనర్జీ తిరిగి అధికారంలోకి వస్తారని పేర్కొన్నాయి. అయితే కాంగ్రెస్.. లెఫ్ట్ పార్టీలు మరోసారి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటాయనే విషయంలో అన్ని సంస్థలు ఏకీభవించాయి.
బెంగాల్ అసెంబ్లీలో మెజారిటీ మార్కు 148 కాగా.. మే 4న వెలువడే అసలు ఫలితాలపై యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా లేక మమతా బెనర్జీ ధీమా నిజమవుతుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Read Also: ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ. 1192 కోట్ల నిధులు విడుదల