Rice Rate : జపాన్ ఆకలితో అలమటిస్తోంది. బియ్యం దొరక్క రగిలిపోతోంది. రైస్ రేట్ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం జపాన్‌లో కిలో బియ్యం ధర మన కరెన్సీలో 500 రూపాయలు పలుకుతోంది. కిలో 500 అంటే మాటలా? అంతటి కష్టకాలంలో జపాన్ కేబినెట్ మినిస్టర్ ‘టకు ఎటో’ ఓ జోక్ వేశాడు. అదికాస్తా వికటించి.. అతని పదవిని ఊడగొట్టింది.
తాను బియ్యం కొననన్న మంత్రి..
మద్దతుదారులు తనకు పుష్కలంగా బహుమతులుగా ఇచ్చినందున తాను ఎప్పుడూ బియ్యం కొనాల్సిన అవసరం లేదన్నారు జపాన్ వ్యవసాయ మంత్రి. అంతే. ఆ మాటకే జపనీస్‌కు చిర్రెత్తుకొచ్చింది. బియ్యం కొనలేక తాము నానా తంటాలు పడుతుంటే.. మంత్రి గారేమో ఇలా జోకు లేస్తారా? అంటూ సీరియస్ అయ్యారు. ఇదే అదనుగా ప్రతిపక్ష పార్టీ అతనిపై అవిశ్వాస తీర్మాణానికి రెడీ అయింది. ఇటు ప్రజల నుంచి వ్యతిరేకత, అటు పార్టీల నుంచి ఒత్తిడి పెరగడంతో.. జపాన్ మంత్రి మొదట క్షమాపణలు చెప్పారు. అయినా, ఎవరూ తగ్గకపోవడంతో చివరాఖరికి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
జపాన్‌లో రైస్ సెంటిమెంట్
ఇండియాలో ఉల్లిపాయ ధర ప్రభుత్వాలను మార్చేసిన చరిత్ర ఉన్నట్టే.. జపాన్‌లో 1918 లో ఒకసారి బియ్యం ధర పెరగడంపై అల్లర్లు చెలరేగి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేశాయి. మళ్లీ ఇప్పుడు ఇలా ఓ మంత్రి.. పదవిని పీకేశాయి. హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు దాడి తర్వాత జపాన్‌లో ఈ స్థాయి ఆహార సంక్షోభం రావడం ఇదే మొదటిసారి. ఏడాది కాలంలోనే బియ్యం ధర డబుల్ అయింది.
జపాన్‌లోనూ వరి వేస్తే ఉరే!
తెలంగాణలో కేసీఆర్ హయాంలో వరి వేస్తే ఉరి అన్నట్టుగానే.. జపాన్‌లోనూ 1995 తర్వాత ధాన్యం సాగును బాగా నిరుత్సాహ పరిచింది అక్కడి సర్కారు. గోధువ, సోయాబీన్ మీద దృష్టి సారించారు. అలా క్రమక్రమంగా రైతులు వరి పంట పండించడం తగ్గించేశారు. ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. డిమాండ్ మేరకు ధాన్యం సరఫరా లేకపోవడంతో.. ధర విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఏడాది 7 మిలియన్ టన్నుల పంట కావాల్సి ఉండగా.. కేవలం 6.6 మిలియన్ టన్నులు పంట దిగుబడి మాత్రమే వచ్చింది. ఆ లోటు కారణంగానే ధర పెరిగిందని చెబుతున్నారు.
టూరిస్టుల ఎఫెక్ట్!
కరోనా తర్వాత జపనీస్ బయటి ఫుడ్ బాగా తినడానికి అలవాటు పడ్డారు. ఆ దేశంలో రైస్ ఐటమ్స్‌కే ఎక్కువ డిమాండ్ ఉంది. ఇదే సమయంలో జపాన్‌కు వచ్చే టూరిస్టులు సంఖ్య కూడా బాగా పెరిగింది. అసాధారణ అధిక ఉష్ణోగ్రతల వల్ల వరి దిగుబడి తగ్గిపోయింది. అన్నీ కలిసి.. బియ్యం ధరను అమాంతం పెంచేశాయి. ధరలను తగ్గించడానికి జపాన్ ప్రభుత్వం తమ దగ్గరున్న ఎమర్జెన్సీ స్టోరేజ్ నుంచి బియ్యం నిల్వలను బయటకు రిలీజ్ చేసింది. అయినా, లోటు భర్తీ కాకపోవడంతో కష్టాలు తప్పలేదు. విదేశాల నుంచి బియ్యం ఇంపోర్ట్ చేసుకోవాలని చూస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో జపాన్ వ్యవసాయ మంత్రి బియ్యంపై జోకులు వేయడంతో అతను పదవికి రాజీనామా చేయాల్సి రావడం ఆసక్తికరంగా మారింది.