MP Chamala Kiran Kumar Reddy: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో తాము కూడా భాగస్వాములు కావాలని సస్పెండ్ అయిన ఎంపీలు పట్టుబడుతున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో మకర ద్వార్ వద్ద రెండో రోజు కూడా నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సభలో అందరినీ సమానంగా చూడాల్సిన స్పీకర్ కేవలం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తొలి విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చామల గుర్తు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయడాన్ని నిరసిస్తూ తాము స్పీకర్ వెల్‌లోకి వెళ్లామని తెలిపారు. ప్రజా సమస్యల మీద ప్రతిపక్షం గొంతు విప్పకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీ అమిత్ షా కిరణ్ రిజిజు చెప్పినట్లుగా పని చేస్తున్నారని విమర్శించారు. ఒక స్పీకర్ హోదాలో ఉండి అధికార పార్టీ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
సస్పెన్షన్ విధింపులో స్పీకర్ పక్షపాత బుద్ధి ప్రదర్శించారని ఎంపీ చామల ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించిన నిషికాంత్ దూబే అనురాగ్ ఠాకూర్ వంటి అధికార పార్టీ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. కేవలం కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన ఎనిమిది మంది సభ్యులను మాత్రమే సస్పెండ్ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ధ్వజమెత్తారు. మహిళా సభ్యులు ప్రధానమంత్రిపై దాడి చేస్తారంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు అత్యున్నత పదవికి తగవని హితవు పలికారు. సభలో ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుంటే అధికార పక్ష సభ్యుల చేత అంతరాయం కలిగిస్తూ ప్రజలకు తప్పుడు సందేశం పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమపై విధించిన సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొనే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన ఎంపీలుగా తమను సభలోకి అనుమతించాలని కోరారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ సస్పెన్షన్ వేటు ఎత్తేసే వరకు పార్లమెంట్ ఆవరణలో ధర్నా కంటిన్యూ చేస్తామని ప్రకటించారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను నెరవేర్చకుండా తమను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.