Nitish Kumar: నితీశ్ కుమార్ మరో అరుదైన ఘనతను అందుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించడంతో ఆయన పదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ అరుదైన రాజకీయ రికార్డును అంతర్జాతీయస్థాయిలో గుర్తిస్తూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నితీశ్ కుమార్ పేరును ప్రత్యేకంగా తమ జాబితాలోకి చేర్చింది.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి నితీశ్ కుమార్‌కు పంపిన అధికారిక లేఖలో, ఆయన సాధించిన ఘనతను భారత ప్రజాస్వామ్య చరిత్రలో అపూర్వమైన ఉదాహరణగా అభివర్ణించారు. 1947 నుంచి 2025 మధ్య కాలంలో ఒకే రాష్ట్రానికి పదిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి వ్యక్తిగా నిలవడం భారతదేశానికి కూడా ఒక ప్రతిష్ఠాత్మక గౌరవం అని వారి లేఖలో పేర్కొన్నారు. సుపరిపాలన, అభివృద్ధి, సామాజిక సంక్షేమం కోసం నితీశ్ కుమార్ చేస్తున్న కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ఆ సంస్థ కొనియాడింది. ఆయన నాయకత్వ పటిమ వల్లే పదేపదే ప్రజల మన్ననలు పొందుతున్నారని వివరించింది.
దేశంలో ఎన్నో నాయకులు పలు దఫాలుగా పదవులను చేపట్టినప్పటికీ, ఒకే రాష్ట్రంలో పదిసార్లు బాధ్యతలు చేపట్టిన నాయకుడు నితీశ్ కుమారే కావడం ఈ రికార్డుకు ప్రత్యేకత తెచ్చింది.
ఈ అరుదైన రికార్డు ప్రకటించబడిన తరువాత బీహార్‌లోని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రముఖులు నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలియజేశారు.
జేడీయూ నాయకులు, ఎన్డీయే శ్రేణులు ఈ విజయాన్ని పార్టీకి, మద్దతుదారులకు గర్వకారణంగా పేర్కొన్నారు. పదే పదే ప్రజలు తమ నాయకుడిగా ఎన్నుకోవడం రాజకీయాల్లో అత్యున్నత ప్రజాభిమానానికి సంకేతం అని పలువురు అభిప్రాయపడ్డారు.
1.తొలి అవతరణ — 2000 (మార్చి 3 నుండి మార్చి 10 వరకు)
2000లో సమతా పార్టీ–బీజేపీ కూటమి బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయగా, మొదటిసారిగా నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాజకీయ అస్థిరతల కారణంగా ప్రభుత్వం కేవలం ఏడు రోజులే కొనసాగింది.
2. రెండవసారి సీఎం — 2005 నుంచి 2010 వరకు
2005 ఎన్నికల్లో ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో.. నితీశ్ కుమార్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
3. మూడోసారి పాలన — 2010 నుంచి 2014 వరకు
జేడీయూ–బీజేపీ కూటమి మరోసారి విజయం సాధించడంతో.. ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ పరాజయంతో బాధ్యత తీసుకుంటూ నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
4. నాలుగోసారి సీఎం — 2015 ఫిబ్రవరి నుండి నవంబరు వరకు
2015లో మహాఘట్బంధన్ కూటమి మద్దతుతో నీతీశ్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఈసారి కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూలు కలిసి ఆయనకు మద్దతిచ్చి విశ్వాస పరీక్షను విజయవంతం చేశారు.
5. ఐదోసారి పాలన — 2015 నవంబరు నుండి 2017 జులై వరకు
అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్బంధన్ ఘనవిజయం సాధించడంతో నీతీశ్ వరుసగా ఐదోసారి సీఎం అయ్యారు.
6. ఆరోసారి సీఎం — 2017 జులై నుండి 2020 నవంబరు వరకు
మహాఘట్బంధన్ నుండి బయటకు వచ్చి ఎన్డీయేలో చేరిన నీతీశ్ ఆ వెంటనే మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
7. ఏడోసారి పాలన — 2020 నుండి 2022 వరకు
2020 ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప ఆధిక్యంతో గెలవడంతో ఆయన ఏడోసారి సీఎం అయ్యారు. జేడీయూ తక్కువ సీట్లు సాధించినప్పటికీ ఎన్డీయే ఏకగ్రీవంగా ఆయనను నాయకుడిగా ఎంచుకుంది.
8. ఎనిమిదోసారి పాలన — 2022 ఆగస్టు నుండి 2024 జనవరి వరకు
2022లో మరోసారి రాజకీయ సంచలనం సృష్టిస్తూ ఆయన ఎన్డీయే ప్రభుత్వానికి రాజీనామా చేసి, మహాఘట్బంధన్ కూటమిలో చేరారు. ఆ కూటమి మద్దతుతో ఎనిమిదోసారి రాష్ట్రాభివృద్ధి పగ్గాలు చేపట్టారు.
9. తొమ్మిదోసారి పాలన — 2024 జనవరి నుండి 2025 నవంబరు వరకు
2024లో మళ్లీ కూటమి మార్పు చేసి ఎన్డీయేతో చేతులు కలిపారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారినప్పటికీ, నీతీశ్ ముఖ్యమంత్రి పదవి నిరాటంకంగా కొనసాగింది.
10. పదోసారి బీహార్ ముఖ్యమంత్రి — 2025 నవంబర్
చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఒకే నాయకుడు పది సార్లు ముఖ్యమంత్రిగా అవతరించడం ఇదే మొదటిసారి. 2025 ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించడంతో నీతీశ్ కుమార్ మళ్లీ సీఎం అయ్యారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఈ అరుదైన ఘనతను అధికారికంగా గుర్తించింది.