Blast At Tamil Nadu: తమిళనాడులోని ఓ ఫైర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విరుధునగర్ జిల్లా సత్తూరు సమీపంలోని కీళతైల్‌పట్టి గ్రామంలో హిందూస్తాన్ పేరుతో ఈ ఫ్యాక్టరీ ఉంది.
ఉదయం పదిగంటల సమయంలో ఒక్కసారిగా ఫ్యాక్టరీలోని గదిలో పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలోని 10 గదులు పూర్తిగా నేలమట్టమయ్యాయి. పేలుడు తీవ్రంగా ఉండటంతో, ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించిందని స్థానికులు వెల్లడించారు.
పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన కార్మికులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచార ప్రకారం భద్రతా చర్యలు పాటించకపోవడమే.. ఇందుకు కారణం అని అనుమానిస్తున్నారు. పేలుడు పదార్థాల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగినట్టు భావిస్తున్నారు. ఫ్యాక్టరీలో అవసరమైన భద్రతా పరికరాలు కూడా లేవన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పోలీసులు ఫ్యాక్టరీ ఫోర్‌మెన్‌ను అరెస్ట్ చేశారు. అలాగే ఫ్యాక్టరీ యజమాని సహా నలుగురిపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఫ్యాక్టరీ సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. తమిళనాడులో ఇటీవలి కాలంలో పేలుడు పదార్థాల ఫ్యాక్టరీల్లో ఇలాంటివి తరచుగా జరుగుతున్నాయి. గతంలో కూడా విరుధునగర్ జిల్లాలో ఇటువంటి ఘోర ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీల పట్ల సరైన పర్యవేక్షణ లేదని, అక్రమ లైసెన్స్‌లతో పని చేస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
Also Read: చంపేసి పక్కన కూర్చుని ఏడుస్తూ.. 5 ఏళ్ల బాలికను చిన్నమ్మే దారుణంగా..
ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలాన్ని మూసివేసి.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాద నివారణ అధికారులు, సీఐడీ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించనుంది. ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక అనంతరం విడుదల కానుంది. ఫ్యాక్టరీ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. మృతుని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.