Lamborghini Crash: రూ.9 కోట్లు పోసి కొనుక్కున్న కారు చిన్న ప్రమాదానికి తుక్కు తుక్కైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముంబై కోస్టల్ రోడ్డులో లంబోర్గిని లగ్జరీ కారు ప్రమాదానికి గురైంది.
శనివారం ఉదయం 9:15 గంటలకు కోస్టల్ రోడ్డులో లంబోర్గిని కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. వైరల్ అవుతున్న వీడియోల్లో నారింజ రంగు లంబోర్గిని కారు తీవ్రంగా దెబ్బతినట్లు కనిపిస్తుంది. భారీ వర్షంతో రోడ్డుపై నీరు చేరింది. వేగంగా వచ్చిన లంబోర్గిని నియంత్రణ కోల్పోయి డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు, నియంత్రణ కోల్పోయిన తర్వాత దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో లగ్జరీ కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. బంపర్, హుడ్ తుక్కు తుక్కైంది. బోనెట్ భాగం దెబ్బతిని కారు ఇంజిన్ భాగాలు బయటకు కనిపిస్తున్నాయి. ప్రమాదం అనంతరం కారు చుట్టూ అనేక మంది నిలబడి ఉండటం వీడియోలో కనిపిస్తుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
కారు ప్రమాద వీడియోను రేమండ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు.” మరో లంబోర్గిని ప్రమాదం. ఈసారి ముంబై కోస్టల్ రోడ్‌లో శనివారం ఉదయం 9:15 గంటలకు జరిగింది. ఈ కార్లకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉందా? మంటలు అంటుకోవడం నుంచి పట్టు కోల్పోవడం వరకు – లంబోర్గినికి ఏమి జరుగుతోంది?” అని ఆయన ఈ వీడియో పోస్టు చేశారు.
Also Read: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
వర్షంతో తడిసిపోయిన రోడ్ల కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పీటీఐతో ముంబై పోలీసులు తెలిపారు. మరొక వీడియోలో వర్షంలో వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి గుండ్రంగా తిరుగుతూ రోడ్డు డివైడర్ ను ఢీకొట్టిన దృశ్యాలు కనిపించాయి. కారు డ్రైవర్‌ను అతిష్ షా (52) గా పోలీసులు గుర్తించారు. కారు రోడ్డుపై స్కిడ్ అయి డివైడర్‌ను ఢీకొట్టిందని తెలిపారు. అతిష్ షా దక్షిణ ముంబైలోని నేపియన్ సీ రోడ్ నుంచి కొలాబాకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న కారును మరో వాహనం సాయంతో తరలించారు. ర్యాష్ డ్రైవింగ్ సంబంధిత సెక్షన్ల కింద షాపై పోలీసులు కేసు నమోదు చేశారు.